Earthquake: మొరాకోలో భారీ భూకంపం.. 632 మంది దుర్మరణం, వందలాది మంది క్షతగాత్రులు.. వివరాలివే (Video)
మొరాకోలో భారీ భూకంపం చోటుచేసుకుంది. 632 మంది ఈ భూకంపంలో దుర్మరణం చెందారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. శుక్రవారం రాత్రి మారకెశ్‌కు సుమారు 70 కిలోమీటర్ల దూరంలో అట్లాస్ కొండల్లో భూకంప కేంద్ర ఉన్నది.
న్యూఢిల్లీ: ఆఫ్రికా దేశం మొరాకలో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర ఆఫ్రికాలో అరుదుగా భూకంపాలు వస్తుంటాయి. శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న భారీ భూకంపంలో కనీసం 632 మంది మరణించారు. వందలాది మంది గాయాలపాలయ్యారు. సెంట్రల్ మొరాకలో 6.8 తీవ్రతతో ఈ భూకంపం చోటుచేసుకుంది.
మొరాకో ఇంటీరియర్ మినిస్ట్రీ శనివారం తెల్లవారుజామున ఈ భూకంపం గురించి ఓ ప్రకటన చేసింది. భూకంపం చోటుచేసుకున్న ఏరియాల్లో కనీసం 632 మంది మరణించారని తెలిపింది. అదనంగా మరో 300 మందిని చికిత్స కోసం హాస్పిటళ్లకు తరలించినట్టు వివరించింది. చాలా వరకు నష్టం నగరాల వెలుపల చిన్న పట్టణాల్లో చోటుచేసుకున్నట్టు పేర్కొంది. అయితే.. ఈ భూకంప నష్టాన్ని అధికారులు ఇంకా అంచనా వేయాల్సి ఉన్నది.
భూమి కంపించగానే ప్రజలు భయంతో బయటకు పరుగుపెట్టారు. భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భవనాలు, రిసార్టులు, హోటళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగుతీశారు. ఆ భయానక క్షణాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.
అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం శుక్రవారం రాత్రి 11.11 గంటలకు 6.8 తీవ్రతతో కొన్ని సెకండ్లపాటు భూమి కంపించింది. అట్లాస్ కొండల్లో మారకెశ్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్ర ఉన్నట్టు అధికారులు తెలిపారు. టౌబ్‌కాల్‌కు సమీపంలోనే ఇది ఉంటుంది.
Also Read: విషాదం.. మొరాకోలో భారీ భూకంపం.. 296 మంది మృతి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ భూకంపంపై స్పందించారు. భూకంపం వల్ల మరణించినవారికి ఆయన ఎక్స్ ద్వారా సంతాపం తెలిపారు. మొరాకలో భూకంపం వల్ల మరణాలు తనను కలచివేసినట్టు వివరించారు. ఈ విషాద సమయంలో తాము మొరాకోకు అండగా ఉంటామని తెలిపారు. తమ ఆప్తులను కోల్పోయిన వారికి సానుభూతి అని వివరించారు. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.