Asianet News TeluguAsianet News Telugu

విషాదం.. మొరాకోలో భారీ భూకంపం.. 296 మంది మృతి

మొరాకోలో భారీ భూకంపం వచ్చింది. రిక్టర్ స్కూల్ పై దీని తీవ్రత 6.8గా నమోదు అయ్యింది. దీని వల్ల భారీగా ప్రాణనష్టం జరిగింది. దాదాపు 296 మంది మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ మరణాలపై ఇంకా అధికారక ప్రకటన రాలేదు

Tragedy.. Huge earthquake in Morocco.. 296 people died..ISR
Author
First Published Sep 9, 2023, 9:36 AM IST

మొరాకోలో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. ఒక్క సారిగా  వచ్చిన ఈ భూ ప్రకంపనల దాటికి 296 మంది మృతి చెందారు. అయితే అధికారికంగా ఈ మరణాల ఇంకా గణాంకాలు విడుదల కాలేదు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11:11 గంటలకు మరకేష్ కు నైరుతి దిశగా 44 మైళ్ల (71 కిలోమీటర్లు) దూరంలో 18.5 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపిందని ‘ఎన్టీటీవీ’ నివేదించింది. 

రిక్టర్ స్కేల్ పై 6.8 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం వల్ల దాదాపు 10 నిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టెలిఫోన్ నెట్ వర్క్ కూడా ఆగిపోయిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రకంపనలు వల్ల అనేక మంది ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఆందోళనకు గురయ్యారు. ఈ భూకంపం వల్ల ఇళ్లు కూలడంతో మరణాలు సంభవించాయి. అలాగే అనేక మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులు మరకేష్ లోని ఆసుపత్రులకు భారీగా తరలివచ్చారు.

తీరప్రాంత నగరాలైన రబాట్, కాసాబ్లాంకా, ఎస్సౌయిరాలో కూడా ప్రకంపనలు వచ్చాయి. కాగా.. భూకంపాల ప్రభావంపై ప్రాథమిక అంచనాలను అందించే యుఎస్జీఎస్ పీజీఆర్ వ్యవస్థ, ఆర్థిక నష్టాలకు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. గణనీయమైన నష్టం జరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఎల్లో అలర్ట్ జారీ చేయడం వల్ల మరణాలు సంభవించాయని తెలుస్తోంది. 

కాగా.. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల మరకేష్ లో ఇంటర్నెట్ కనెక్టివిటీకి అంతరాయం కలిగిందని గ్లోబల్ ఇంటర్నెట్ మానిటర్ నెట్ బ్లాక్స్ తెలిపింది. మొరాకోలో ఇప్పటి వరకు సంభవించిన అత్యంత శక్తిమంతమైన భూకంపం ఇదేనని మొరాకో మీడియా పేర్కొంది. పొరుగున ఉన్న అల్జీరియాలో కూడా భూకంపం సంభవించిందని, దీని వల్ల ఎలాంటి నష్టం, ప్రాణనష్టం జరగలేదని అల్జీరియా సివిల్ డిఫెన్స్ తెలిపింది.

2004లో ఈశాన్య మొరాకోలోని అల్ హోసిమాలో సంభవించిన భూకంపంలో 628 మంది మరణించగా, 926 మంది గాయపడ్డారు. పొరుగున ఉన్న అల్జీరియాలో 1980లో 7.3 తీవ్రతతో సంభవించిన ఎల్ అస్నామ్ భూకంపం ఇటీవలి చరిత్రలో అతిపెద్ద, అత్యంత విధ్వంసకర భూకంపాల్లో ఒకటి. ఆ సమయంలో 2,500 మంది మరణించారు. 300,000 మందిని నిరాశ్రయులయ్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios