Asianet News TeluguAsianet News Telugu

భారతీయులకు, మోడీకి తక్షణం క్షమాపణలు చెప్పండి .. ముయిజ్జును కోరిన మాల్దీవుల ప్రతిపక్షనేత

న్యూఢిల్లీ, మాలేల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య భారత ప్రధాని నరేంద్ర మోడీకి, భారతీయులకు క్షమాపణలు చెప్పాలని మాల్దీవుల జుమ్‌హోరీ పార్టీ నాయకుడు ఖాసీం ఇబ్రహీం.. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూను కోరారు.

Apologise to India and PM Modi, Maldives Opposition tells President Mohammed Muizzu (WATCH) ksp
Author
First Published Jan 30, 2024, 5:56 PM IST

ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయులనుద్దేశించి జాతి విద్వేష వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల ప్రభుత్వ పెద్దల వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. భారతీయుల దెబ్బకు ఆ దేశ ఆర్ధిక వ్యవస్థే చిక్కుల్లో పడింది. న్యూఢిల్లీ, మాలేల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య భారత ప్రధాని నరేంద్ర మోడీకి, భారతీయులకు క్షమాపణలు చెప్పాలని మాల్దీవుల జుమ్‌హోరీ పార్టీ నాయకుడు ఖాసీం ఇబ్రహీం.. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూను కోరారు. భారత్, మోడీ గురించి మాల్దీవులకు చెందిన ముగ్గురు రాజకీయ నేతలు చేసిన అవమానకరమైన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఇబ్రహీం నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. 

ఇటీవలి చైనా పర్యటన తర్వాత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి భారత ప్రభుత్వానికి , ప్రధాని నరేంద్ర మోడీకి అధికారికంగా క్షమాపణలు చెప్పాలని తాను అధ్యక్షుడు ముయిజ్జూను కోరుతున్నానని ఇబ్రహీం మంగళవారం అన్నారు. భారత్, మాల్దీవుల మధ్య దిగజారుతున్న సంబంధాల పై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ ఏ దేశానికి సంబంధించి, ప్రత్యేకించి పొరుగుదేశానికి సంబంధించి, మనం సంబంధాలను ప్రభావితం చేసేలా మాట్లాడకూడదు. మన రాష్ట్రం పట్ల మనకు ఒక బాధ్యత వుంది, దానిని పరిగణించాలి’’ అని ఇబ్రహీం అన్నారు. ముయిజ్జూ ముందు అధ్యక్షుడిగా పనిచేసిన ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ జారీ చేసిన ప్రెసిడెన్షియల్ డిక్రీని రద్దు చేయడంపైనా జుమ్‌హోరీ పార్టీ నేత ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రస్తుత అధ్యక్షుడి వివాదాస్పద ‘‘ఇండియా ఔట్’’ ప్రచారాన్ని నిషేధించేలా వుందన్నారు. 

కాగా.. ఇరుదేశాల మధ్య ఇటీవల చోటు చేసుకున్న దౌత్యపరమైన వివాదం కారణంగా భారతీయులకు ఫేవరేట్ డెస్టినేషన్‌గా వున్న మాల్దీవుల పర్యాటకంపై నీలినీడలు కమ్ముకునేలా చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటన సందర్భంగా ముగ్గురు మాల్దీవుల కేబినెట్ మంత్రులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యలతో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ అధికారిక డేటా ప్రకారం.. పర్యాటకుల సంఖ్యలో గణనీయమైన మార్పును చూపెడుతోంది. దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య గడిచిన మూడు వారాల్లో భారతీయులు అగ్రస్థానం నుంచి ఐదవ స్థానానికి పడిపోయారు. 

 

 

ఈ ద్వీప దేశానికి భారతీయ సందర్శకుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదలను డేటా హైలైట్ చేస్తోంది.  2 లక్షల మంది భారతీయులు ఏటా మాల్దీవులను సందర్శించేవారు. కోవిడ్ మహమ్మారి తర్వాత మాల్దీవులను సందర్శించిన అతిపెద్ద పర్యాటక సమూహం భారతీయులే. గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జనవరి 28 వరకు మాల్దీవులకు 1.74 లక్షల మంది అంతర్జాతీయ పర్యాటకులు వచ్చారు. వీరిలో భారత్ నుంచి కేవలం 13,989 మంది మాత్రమే . లిస్ట్ రష్యా 18,561 మందితో తొలి స్థానంలో నిలవగా.. తర్వాత ఇటలీ (18,111), చైనా (16,529), యూకే (14,588) వున్నాయి. యూఎస్ఏ, ఫ్రాన్స్, పోలాండ్, స్విట్జర్లాండ్, జర్మనీలు తర్వాత నిలిచాయి. 2023లో మాల్దీవులకు 17 లక్షల మంది విదేశీ పర్యాటకులు వచ్చారు. వీరిలో అత్యధిక సంఖ్యలో భారతీయులు (2,09,198), రష్యన్లు (2,09,146), చైనీయులు (1,87,118) మంది వున్నారు. 

2022లో మాల్దీవులను సందర్శించిన భారతీయుల సంఖ్య 2.4 లక్షల పైమాటే. అది 2021లో 2.11 లక్షలకు చేరుకుంది. కోవిడ్ సవాళ్లు ఉన్నప్పటికి అంతర్జాతీయ పర్యాటకులకు అందుబాటులో వున్న కొన్ని దేశాలలో మాల్దీవులు ఒకటిగా వుంది. ఆ ఏడాది దాదాపు 63000 మంది భారతీయులు మాల్దీవులను సందర్శించారు. 2018లో 90,474 మంది సందర్శకులతో మాల్దీవులకు వచ్చిన పర్యాకుల్లో భారతీయులు ఐదవ స్థానంలో నిలిచారు. 2019 నాటికి భారత్ రెండవ స్థానానికి చేరుకోవడం విశేషం. 

ఇటీవలి దౌత్యపరమైన ఉద్రిక్తతలతో మాల్దీవుల టూర్‌ను రద్దు చేసుకోవాలని భారతీయులు నిర్ణయించుకున్నారు. పలు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో 'boycott campaign' అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. భారతదేశానికి సంఘీభావంగా ఆన్‌లైన్ ట్రావెల్ అగ్రిగేటర్ అయిన EaseMyTrip తన వెబ్‌సైట్‌లో మాల్దీవులకు అన్ని విమాన బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. 

మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు డిప్యూటీ మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మాల్దీవులకు ప్రత్యామ్నాయంగా లక్షద్వీప్‌ను ప్రోత్సహించేందుకే మోడీ .. లక్షద్వీప్‌కు వచ్చారని ఈ మంత్రులు పోస్ట్ చేశారు. అవి కేవలం వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని, విదేశీ నేతలపై సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంలలో చేసిన వ్యాఖ్యలు తమ దేశ అధికారిక వైఖరిని ప్రతిబింబించవని మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios