ఇద్దరు ఖైదీలు జైలు నుంచి టూత్ బ్రష్ ఉపయోగించి పారిపోయారు. టూత్ బ్రష్‌తో వారు ఏకంగా జైలు గోడకే కన్నం వేశారు. ఎవరికీ తెలియకుండా మెల్లిగా జారుకున్నారు. అయితే, వారికి ఆ స్వేచ్ఛ ఎంతో కాలం దక్కలేదు. కొన్ని గంటల్లోనే సమీప రెస్టారెంట్‌ దగ్గర వారు అరెస్టు అయ్యారు. 

న్యూఢిల్లీ: ఇద్దరు ఖైదీలు తమ వద్ద ఉన్న వస్తువులతోనే జైలు గోడను బద్ధలు కొట్టాలని ఎత్తుగడలు వేశారు. అందుకు ఎవరూ ఊహించని రీతిలో టూత్ బ్రష్‌నే ఆయుధంగా మలుచుకున్నారు. ఆ టూత్ బ్రష్‌తో గోడను పగుల గొట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ టూత్ బ్రష్‌తోనే జైలు గోడకు కన్నం వేయడం సఫలం అయ్యారు. చీకటి పడ్డ తర్వాత వారు ఆ జైలు గోడకు కన్నం వేసి బయటపడ్డారు. జైలు గది నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎత్తైన గోడనూ అవలీలగా దాటేశారు. జైలు నుంచి కిలోమీటర్ల మేరకు పారిపోయారు.

ఈ ఘటన అమెరికాలని వర్జీనియాలో చోటుచేసుకుంది. న్యూపోర్ట్ న్యూస్ డిటెన్షన్ అన్నెక్స్‌లో సోమవారం ఈ ఘటన జరిగింది. ఈ జైలులో 37 ఏళ్ల జాన్ ఎం గార్జా, 43 ఏళ్ల ఆర్లి వీ నీమోలు ఖైదీలుగా ఉన్నారు. కోర్టు ధిక్కరణ, నిబంధనల ఉల్లంఘటన, కోర్టులో హాజరుకాకపోవడం వంటి నేరాలతో గార్జాకు జైలు శిక్ష పడింది. ఫోర్జరీ, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్, నిబంధనల ఉల్లంఘటన వంటి నేరాలతో నీమో అరెస్టు అయ్యాడు.

వీరిద్దరూ జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో వారు టూత్ బ్రష్ ఒక మెటల్ పరికరం ఉపయోగించి పెద్ద గోడకు కన్నం వేశారు. బయట అడుగు వేసి పరుగో పరుగు. కొన్ని కిలోమీటర్లు పారిపోయారు. ఆ న్యూపోర్ట్ న్యూస్ డిటెన్షన్ అన్నెక్‌లో ఖైదీల అటెండెన్స్ తీసుకుంటూ ఉండగా ఈ ఇద్దరు మిస్ అయ్యారు. ఎంత చూసినా కనిపించలేదు. జైలు గదిని చూస్తే కన్నం కనపడింది. వారు పారిపోయారని అధికారులు అర్థం చేసుకున్నారు. వెంటనే అలర్ట్ అయ్యారు.

Also Read: మహాత్ముడికి డిగ్రీ లేదన్న వ్యాఖ్యలు అవాస్తవం.. జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌పై గాంధీ మనవడి మండిపాటు

గోడకు కన్నం వేసి పారిపోయిన ఆ ఇద్దరు ఖైదీలు ఎంతో కాలం స్వేచ్ఛను అనుభవించలేదు. కొన్ని గంటలు గడిచిన తర్వాత తెల్లవారు జామున ఓ ప్యాన్ కేక్ రెస్టారెంట్ వద్ద చిక్కారు. ప్యాన్ కేక్ తినడానికి వారిద్దరూ ఆ ఐహోప్ రెస్టారెంట్‌లో దూరారు. కానీ, అక్కడ తోటి డైనర్లలో కొందరు అనుమానాస్పదంగా వారిని చూశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ ఇద్దరు ఖైదీలను పట్టుకున్నారు. 

ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. అయ్యో.. వారు ఆ ప్యాన్ కేక్ అయినా తిన్నారా? అని కొందరు సానుభూతి వ్యక్తం చేశారు. ఇంకొందరు.. తిన్న ప్యాన్ కేక్ బిల్లు కట్టడానికి బహుశా వారు ఆలోచనల్లో నిమగ్నమైపోయి ఉంటారు అని మరొకరు అన్నారు. కాగా, చాలా మంది హాలీవుడ్ క్లాసిక్ మూవీ ది షాషాంక్ రిడింప్షన్ సినిమాను తలుచుకోలేకుండా ఉండలేకపోయారు. షాషాంక్ రిడింప్షన్ మూవీలో జైలు నుంచి ఖైదీలు పారిపోయే ఇతివృత్తంతోనే ఉంటుంది.