ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను టేకోవర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా మరో సోషల్ మీడియా అప్లికేషన్‌ను జాక్ డోర్సీ డెవలప్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ అప్లికేషన్ బీటా టెస్టు కోసం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఆ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ పేరు బ్లూస్కైగా ఉండనుంది.
న్యూఢిల్లీ: టెస్లా సీఈవో ఎలన్ మస్క్ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను టేకోవర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను చేజక్కించుకోవడం నచ్చనివారు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. కొందరైతే.. ఎలన్ మస్క్‌ను ట్రంప్‌తో పోలుస్తూ ట్విట్టర్‌లో ఎన్నో మార్పులు రావొచ్చని.. ఇప్పుడు ఉన్నంత ప్రజాస్వామికంగా ఉండకపోవచ్చనే ఆరోపణలు చేస్తున్నారు. ఈ తరుణంలో ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సీ అదిరిపోయే ప్రకటన చేశారు.
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా మరో సోషల్ మీడియా అప్లికేషన్‌ను జాక్ డోర్సీ రిలీజ్ చేయబోతున్నారు. ఆ కొత్త సోషల్ మీడియా అప్లికేషన్‌ను బీటా టెస్టు చేస్తున్నట్టు కొన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ట్విట్టర్‌ను ఎలన్ మస్క్ టేకోవర్ చేయడానికి సుమారు వారం రోజుల ముందు జాక్ డోర్సీ తన డీసెంట్రలైజ్డ్ సోషల్ మీడియా అప్లికేషన్ బ్లూస్కై బీటా టెస్టు కోసం ప్రకటన చేశారు.
‘తర్వాతి స్టెప్.. ప్రొటోకాల్‌ను టెస్టు చేయడం మొదలు పెట్టాలి. డిస్ట్రిబ్యూటెడ్ ప్రొటోకాల్ డెవలప్‌మెంట్ ఒక ట్రిక్కీ ప్రాసెస్’ అని కంపెనీ గత గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇది చాలా పార్టీల మధ్య కోఆర్డినేషన్ అవసరమయ్యే పని అని వివరించారు. తాము ముందు ప్రైవేట్ బీటా మొదలు పెడతామని, ఇందులో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తామని తెలిపారు.
బీటీ టెస్టు పూర్తి కాగానే.. ప్రొటోకాల్‌కు సంబంధించిన వాటిపై పని చేస్తామని, వెంట వెంటనే అది ఎలా పని చేస్తుందో వివరాలు వెల్లడిస్తూ వస్తామని వివరించింది. బ్లూస్కై యాప్ అన్ని విధాల సంసిద్ధంగా ఉన్నప్పుడు ఓపెన్ బీటా చేస్తామని వివరించింది. బీటా టెస్టులో పాల్గొనాలనుకునేవారు సైనప్ చేసుకోవడానికి ఓ వెయిట్ లిస్టు లింక్‌నూ షేర్ చేశారు.
ఈ కొత్త యాప్ ఆథెంటికేటెడ్ ట్రాన్స్‌ఫర్ ప్రొటోకాల్ (ఏటీ ప్రొటోకాల్)ను వినియోగిస్తుందని కంపెనీ వివరించింది. కేవలం ఒకే సైట్ కాకుండా చాలా సైట్లు రన్ చేసేలా దీన్ని అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపింది.
Also Read: ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌పై ఎలాన్ మస్క్ వేటు.. ట్విట్టర్‌లో మీమ్‌ల వరద
బ్లూ స్కూ అంటే సమృద్ధిగా అవకాశాలు ఉండే స్పేస్‌గా భావించవచ్చని, ఈ ప్రాజెక్టుకు ఒరిజినల్ పేరు ఇదే. ఆ తర్వాత కూడా కంపెనీకి ఇదే పేరు పెడుతున్నామని ఆ ప్రకటన తెలిపింది.
సోషల్ మీడియా యూజర్ల డేటాను వినియోగించే లేదా సోషల్ మీడియాకు ఉండే మౌలిక విలువలను కాలరాసే సైట్లకు తాము ప్రత్యర్థిగా ఉండాలని బ్లూస్కై యోచిస్తున్నట్టు జాక్ డోర్సీ గత వారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
