బీజింగ్: భారత్-చైనా సరిహద్దులోని గాల్వన్ లోయ ప్రాంతం తమదేనని చైనా ప్రకటించింది. భారత్-చైనా సరిహద్దుల్లోని గాల్వన్ లోయ ప్రాంతంలో ఇండియా చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఈ ఘర్షణలో 20 మంది ఇండియాకు చెందిన జవాన్లు మరణించారు.

గాల్వన్ లోయ ప్రాంతం తమదేనని భారత్ దళాలే వాస్తవాధీన రేఖను దాటి తమ సైనికులపై దాడులు చేశారని చైనా విదేశాంగ ప్రతినిధి జావో లిజియన్ ప్రకటించారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

also read:దేశ సార్వభౌమాధికారంపై రాజీ లేదు,సైలెంట్‌గా ఉండబోం: చైనాకు మోడీ వార్నింగ్

రెచ్చగొట్టే చర్యలకు దిగకుండా భారత్ తమ సైనికులను కట్టడి చేయాలని ఆయన హితవు పలికారు. గాల్వన్ లోయ ప్రాంతం ఎల్లప్పుడూ చైనా భూభాగానికి చెందిందేనని చెప్పారు. కమాండర్ స్థాయి చర్చల్లో ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత కూడ భారత సరిహద్దు దళాలు నిబంధనలు ఉల్లంఘించాయన్నారు.

తమ సైనికులను క్రమశిక్షణతో మెలిగేలా చూసుకోవాలని చైనా భారత్ ను కోరింది. కవ్వింపు చర్యలు మాని చర్చలు, సంప్రదింపుల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలన్నారు. 

గాల్వన్ లోయ తమదంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ చర్చలు, సంప్రదింపుల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. వాస్తవాధీన రేఖ వద్ద జరిగిన ఘర్షణలో తమ సైనికుల తప్పేమీ లేదని ఆయన వెనకేసుకొచ్చారు.

వాస్తవాధీన రేఖ వెంట చైనా భూభాగం వైపే ఘర్షణ జరిగినందు తప్పు ఎవరిదో స్పష్టంగా అర్ధమౌతోందన్నారు.  ఇండియాతో తాము ఘర్షణను కోరుకోవడం లేదని చెప్పారు. చర్చల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.