Asianet News TeluguAsianet News Telugu

పంజ్‌షేర్‌లో భీకరపోరు: అమ్రుల్లా సలేహ్‌ సోదరుడిని హింసించి చంపిన తాలిబన్లు

పంజ్‌షేర్‌ ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నామని ప్రకటించిన తాలిబన్లు.. అక్కడ ఇంటింటి తనిఖీలు చేపట్టి తమ వ్యతిరేకులను, మైనార్టీలను చంపేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో అఫ్గాన్‌ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ సోదరుడు రోహుల్లా సలేహ్‌ను తాలిబన్లు దారుణంగా హతమార్చినట్లు సమాచారం
 

afghanistans caretaker president amrullah saleh brother rohullah saleh killed by talibans in panjshir
Author
Panjshir, First Published Sep 10, 2021, 7:04 PM IST

ఆఫ్గనిస్తాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. అనంతరం తమకు కొరకరాని కొయ్యగా వున్న పంజ్‌షేర్‌లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. భారీ పోరాటం తర్వాత రెసిస్టెన్స్ ఫోర్స్‌పై పైచేయి సాధించిన తాలిబన్లు పంజ్‌షేర్‌లో నరమేధం సృష్టిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని తమ నియంత్రణలోకి తీసుకున్నామని ప్రకటించిన తాలిబన్లు.. అక్కడ ఇంటింటి తనిఖీలు చేపట్టి తమ వ్యతిరేకులను, మైనార్టీలను చంపేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. అయితే కాబుల్‌ను విడిచి పంజ్‌షేర్‌కు వెళ్లిన అఫ్గాన్‌ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ సోదరుడు రోహుల్లా సలేహ్‌ను తాలిబన్లు దారుణంగా హతమార్చినట్లు సమాచారం.  

ఆగస్టు 15న తాలిబన్లు కాబుల్‌ను ఆక్రమించుకోవడంతో రెసిస్టెన్స్‌ ఫోర్సెస్‌ నాయకుడు అహ్మద్‌ మసూద్‌తో కలిసి అమ్రుల్లా సలేహ్‌ పంజ్‌షేర్‌కు వెళ్లిపోయారు. అనంతరం తనను తాను ఆఫ్గాన్‌ ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. అయితే ప్రస్తుతం పంజ్‌షేర్‌లో ఉన్న అమ్రుల్లా సలేహ్‌ అన్నయ్య రోహుల్లా సలేహ్‌ను గుర్తించిన తాలిబన్లు ఆయనను కిరాతకంగా హత్య చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ ప్రాంతంలోని అమ్రుల్లా ఇంట్లోకి చొరబడిన తాలిబన్లు రోహుల్లాను కాల్చి చంపినట్లు సమాచారం.  

Also Read:అఫ్ఘాన్ జర్నలిస్టులపై తాలిబాన్ల క్రూరత్వం.. మహిళల ఆందోళనను కవర్ చేసినందుకు దాడి

మరోవైపు పంజ్‌షేర్‌లోని పలు ప్రాంతాల్లో రెసిస్టెన్స్‌ ఫోర్సెస్‌, తాలిబన్లకు మధ్య భీకర పోరు సాగుతోంది. ఈ దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. లోయలోని పలు ప్రాంతాలను ఆక్రమించుకున్న తాలిబన్లు స్థానిక యువకులను అతి దారుణంగా హతమారుస్తున్నారని, వీరి నరమేధానికి భయపడి ఇప్పటికే 100కు పైగా కుటుంబాలు పారిపోయాయని రెసిస్టెన్స్‌ ఫోర్స్‌ ప్రజలు ట్విటర్‌ వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రపంచం ఎందుకు సాయం చేయడంలేదని వారు ప్రశ్నిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios