Asianet News TeluguAsianet News Telugu

అఫ్ఘాన్ జర్నలిస్టులపై తాలిబాన్ల క్రూరత్వం.. మహిళల ఆందోళనను కవర్ చేసినందుకు దాడి

తాలిబాన్లు తొలుత శాంతి వచనాలు వల్లించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రోజుల వ్యవధిలోనే దాని కర్కశ రూపాన్ని వెల్లడించింది. మానవ హక్కులు, పత్రికా స్వేచ్ఛను తాము గౌరవిస్తామని, వారికి భంగం కలిగించబోమని చెప్పిన తాలిబాన్లు ఇప్పుడు జర్నలిస్టులపైనే క్రూరంగా దాడిచేస్తున్నారు. ప్రస్తుతం దాడులకు గురైన జర్నలిస్టుల చిత్రాలు వైరల్ అవుతున్నాయి.

taliban beaten journalists for covering women protest in afghanistan
Author
New Delhi, First Published Sep 9, 2021, 2:22 PM IST

న్యూఢిల్లీ: తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన రోజుల వ్యవధిలోనే పత్రికా స్వేచ్ఛపై దాడి జరిగింది. ప్రెస్ ఫ్రీడమ్‌కు ఆటంకం కలిగించబోమని గతంలో చేసిన వాగ్దానాలు నీటిమూటలని ఈ చర్యతో ప్రపంచానికి తాలిబాన్ చాటిచెప్పింది. ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల ఆందోళనలను కవర్ చేయవద్దంటూ తాలిబాన్లు హుకూం జారీ చేశారు. ఆందోళనలను రిపోర్ట్ చేసిన జర్నలిస్టులపై క్రూరంగా దాడి చేసింది. ఓ గదిలో బంధించి హింసించింది. అలా తాలిబాన్ల చేతిలో దాడికి గురై దేహమంతా హూనమైన జర్నలిస్టుల గాయాల చిత్రాలు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయి. ముఖ్యంగా ఇద్దరు జర్నలిస్టులు తమ వెన్ను భాగాన్ని కెమెరాకు చూపిస్తున్న ఫొటోలూ తాలిబాన్ల దుర్మార్గాన్ని కళ్లకు కట్టినట్టూ వెల్లడించాయి.

 

ట్విట్టర వెరిఫై చేసిన ఖాతాల్లో ఈ ఫొటోలు కనిపించాయి. లాస్ ఏంజెల్స్ టైమ్స్ విదేశీ ప్రతినిధి మార్కస్ యమ్, అఫ్ఘాన్ న్యూస్ పబ్లికేషన్ హ్యాండిల్ ఇతిలాత్రోజ్‌.. తాలిబాన్ల చేతిలో తీవ్రంగా గాయపడిన జర్నలిస్టుల ఫొటోలు షేర్ చేశాయి. జర్నలిస్టుల దేహమంతా దాడులతో కమిలిపోయాయి. జర్నలిస్టులను విచక్షణా రహితంగా బాదినట్టు వాటి ద్వారా తెలుస్తున్నది. 

 

‘మేం జర్నలిస్టులమని చెప్పినా వారు ఖాతరు చేయలేదు. బహుశా వారు మమ్మల్ని చంపేస్తారేమోనని భయపడ్డా’ అంటూ ఇతిలాత్రోజ్ ఎంప్లాయీ నెమతుల్లా నఖ్దీ వివరించారు. ఆందోళనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులన వేర్వేరు గదుల్లోకి తీసుకెళ్లి తీవ్రంగా బాదుతున్నారు. స్వదేశీ జర్నలిస్టులను మహిళల ఆందోళనలకు సంబంధించి ఫొటోలు తీయకుండా తాలిబాన్లు అడ్డుకున్నారు. విదేశీ జర్నలిస్టులను వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు. కొందరు విదేశీ జర్నలిస్టులనూ అపహరించి కొంతకాలం నిర్బంధించి తర్వాత విడుదల చేసినట్టు లాస్ ఏంజెల్స్ టైమ్స్ పత్రిక పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios