ఉత్తర చైనాలో దారుణఘటన జరిగింది. ఓ రెస్టారెంట్లో స్నేహితులతో కలిసి భోజనం చేస్తున్న మహిళల పట్ల కొందరు అమానుషంగా వ్యవహరించారు. మహిళలను కిందపడేసి తీవ్రంగా కొట్టారు.
బీజింగ్ : చైనాలోని ఒక రెస్టారెంట్‌లో మహిళల బృందంపై దాడి చేసిన ఘటనలో ఎనిమిది మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు శనివారం పోలీసులు తెలిపారు. వీరి మీద లైంగిక దాడి ఆరోపణలున్నాయి. ఉత్తర చైనాలోని హెబీ ప్రావిన్స్‌లోని బార్బెక్యూ రెస్టారెంట్‌లో ఓ మహిళ తన ఇద్దరు సహచరులతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు.. అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ఒక మహిళ వీపుపై తన చేతిని వేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రసారం చేయబడింది. ఇంకా ఆ వీడియోలో.. తన మీద చేయేసిన వ్యక్తిని ఆ మహిళ దూరంగా నెట్టేసింది. దీంతో కోపానికి వచ్చిన అతను తన మిగతా స్నేహితులతో కలిసి.. ఆమెను బయటకు లాగి, నేలపై పడేసి విపరీతంగా కొట్టారు. ఈ క్రమంలో అడ్డువచ్చిన మరో మహిళను కూడా అలాగే కొట్టారు.
ఈ వీడియో చైనాలో లైంగిక వేధింపులు, లింగ-ఆధారిత హింస గురించి సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. చైనాలో పితృస్వామ్య సమాజం, ఇంటర్నెట్ సెన్సార్‌షిప్, అస్పష్టమైన చట్టపరమైన మద్దతు ఉన్నప్పటికీ ఇటీవలి సంవత్సరాలలో మహిళల హక్కుల గురించి మాట్లాడడం బాగా పెరిగింది. అక్కడ ప్రముఖ స్త్రీవాదులు కూడా సాధారణ పోలీసు వేధింపులు, నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నారు. అయితే కొంతమంది మాత్రం చైనాలో గృహహింస తగ్గుముఖం పట్టిందని.. ఈ మేరకు రిపోర్టులు వస్తున్నాయని ప్రచారం చేస్తున్నారు. 2018లో యూనివర్శిటీ మహిళా ప్రొఫెసర్‌ల మీద లైంగిక వేధింపుల అంశం మీద దుమారం రేగడంతో.. #MeToo ఉద్యమం తీవ్రమయ్యింది. దీంతో లైంగిక వేధింపులతో ముడిపడి ఉన్న కీలకపదాలను వెబ్ సెన్సార్‌లు బ్లాక్ చేశాయి.
13యేళ్ల బాలికపై టీనేజ్ బాలుడి అఘాయిత్యం... ఇంట్లో తెలియడంతో పరార్..
హింసాత్మక దాడి, ఇబ్బందులను రెచ్చగొట్టారన్న అనుమానంతో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు టాంగ్‌షాన్ నగరంలో శనివారం పోలీసులు తెలిపారు, అయితే మరొక అనుమానితుడి కోసం అన్వేషణ కొనసాగుతోంది. ఈ సంఘటన తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు మహిళల ఆరోగ్యం స్థిరంగా ఉందని, ప్రాణాపాయస్థితి లేదని.. డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనలో మరో ఇద్దరికి ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు శుక్రవారం తెలిపారు.
ఈ దాడి వీడియో మీద సోషల్ మీడియాలో వందల మిలియన్ల కామెంట్లు వచ్చాయి. నెటిజన్లు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. మహిళలపై జరుతుగుతున్న హింసను అరికట్టాలని అధికారులను కోరారు. ‘ఇది నాకే జరగచ్చే.. లేదంటే మనలో ఎవరికైనా జరగొచ్చు’ అని ఒకరు భయాందోళనలు వ్యక్తం చేశారు. ఈ కామెంట్ ను లక్ష మంది లైక్ చేశారు.
"2022లో ఇంకా ఇలాంటివి ఎలా జరుగుతున్నాయి?" అని ఒకరు ప్రశ్నించగా, "దయచేసి వారికి క్రిమినల్ శిక్షలు విధించండి వారిలో ఎవరినీ వదలొద్దు" అని మరొకరు కామెంట్ చేశారు. ఇక నిరుడు ఓ వ్యక్తి తన భార్య సోషల్ మీడియా లైవ్ లో ఉండగా హత్య చేసిన ఘటనలో.. భర్తకు చైనా కోర్టు మరణశిక్ష విధించింది.
