Asianet News TeluguAsianet News Telugu

కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పులు.. ఏడుగురు మృతి.. మూడు రోజుల వ్యవధిలో రెండో ఘటన..

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. కాలిఫోర్నియాలోని శాన్ మాటియో కౌంటీలో రెండు చోట్ల దుండగులు కాల్పులు జరిపారు. 

7 Dead in two shootings in Half Moon Bay in northern California
Author
First Published Jan 24, 2023, 9:20 AM IST

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. కాలిఫోర్నియాలోని శాన్ మాటియో కౌంటీలో రెండు చోట్ల దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందగా.. ఒకరు గాయపడినట్టుగా అమెరికా మీడియా పేర్కొంది. వివరాలు.. శాన్ ఫ్రాన్సిస్కోకు దక్షిణాన 30 మైళ్ల దూరంలో ఉన్న హాఫ్ మూన్ బే నగర పరిధిలో రెండు వేర్వేరు ప్రదేశాలలో స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 2:20 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయి. కాల్పులు జరిగిన రెండు ప్రాంతాలు కూడా ఒక మైలు దూరంలోనే ఉన్నాయి. కాల్పులు జరిపిన దుండగుడు వాహనంలో ఒకచోటు నుంచి మరోచోటుకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. 

ఈ కాల్పుల్లో ఏడుగురు మృతిచెందగా.. ఒకరు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని స్టాన్‌ఫోర్డ్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. దుండగుడు కేవలం ఒక సెమీ ఆటోమేటిక్ ఆయుధాన్ని మాత్రమే కలిగి ఉన్నాడని పోలీసు అధికారులు భావిస్తున్నారు. అనుమానితుడిని ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకున్నట్టుగా సమాచారం. 

Also Read: అమెరికాలో కాల్పుల ఘటన నిందితుడైన 72 యేళ్ల వృద్ధుడి ఆత్మహత్య...

హాఫ్ మూన్ బేలోని మొదటి ప్రదేశంలో నలుగురు వ్యక్తులు చనిపోగా.. మరోవ్యక్తి గాయపడినట్లు అధికారులు గుర్తించారని షెరీఫ్ క్రిస్టినా కార్పస్ ఒక వార్తా సమావేశంలో తెలిపారు. సమీపంలోని మరొక ప్రదేశంలో మరో ముగ్గురు చనిపోయారని తెలిపారు. 

అయితే కాలిఫోర్నియాలో మూడు రోజుల వ్యవధిలోనే మరోసారి సాముహిక కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇటీవల లాస్ ఏంజిల్స్ సమీపంలో మాంటేరీ పార్క్‌లో చైనీస్ లూనార్ న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్న చోట దుండగుడు జరిపిన కాల్పుల్లో 10 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios