ఎన్నికల్లో పోటీ చేసే ముందు అభ్యర్థులు ఎన్నికల కమీషన్‌కు సమర్పించే నామినేషన్‌ పేపర్లలో అనేక వాస్తవాలు వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా పోటీ చేయబోతున్న అభ్యర్ధుల్లో 60  మందికి ఇద్దరు భార్యలున్న విషయం వెలుగులోకి వచ్చింది.. ఇది ఇండియాలో కాదులెండీ.. పాకిస్తాన్‌లో.. సార్వత్రిక ఎన్నికలకు మన దాయాది దేశం రెడీ అవుతోంది. మరికొన్నిరోజుల్లో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.

తాజాగా ఎన్నికలకు ముందు అభ్యర్ధులు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌ ద్వారా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుమారు 60 మంది నేతల వరకు తమ రెండో పెళ్లి విషయాన్ని దాచిపెట్టినట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. ఇలా దాచిపెట్టిన వారిలో పలువురు ప్రముఖులు ఉన్నారు.. పంజాబ్ ముఖ్యమంత్రి షేబాజ్ షరీఫ్, ఆయన కుమారుడు హమ్జా షేబాజ్, మాజీ ప్రతిపక్ష నేత ఖుర్షీద్ షా, ఎంక్యూఎం-పీ చీఫ్ ఫరూక్ సత్తార్, రైల్వే మాజీ మంత్రి ఖావాజా సాద్ రఫీక్, అర్షాద్ వోహ్రా, పిర్ అమిన్, ఖైసర్ మెహ్‌మూద్, రానా ముబాషార్ తదితరులు. ఈ నెల 25న పాక్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగున్నాయి.