న్యూజిలాండ్‌లో 6.2 తీవ్రతతో భూమి కంపించినట్టు వల్కనో డిస్కవరీ రిపోర్ట్ చేసింది. గిస్బోర్న్ నగరంలో అంతకు ముందు 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఒక వైపు ఈ దేశం గ్యాబ్రియెల్ తుఫాన్ ముంగిట్లో ఉండగా భూకంపాలు కలకలం రేపుతున్నాయి. 

న్యూఢిల్లీ: న్యూజిలాండ్ దేశానికి ప్రకృతి సవాళ్లు విసురుతున్నది. పుండు మీద దెబ్బ తగిలినట్టు కొన్ని రోజులుగా గ్యాబ్రియెల్ తుఫాన్‌తో దేశం గజగజ వణుకుతుండగా తాజాగా భూకంపం మరింత ప్రమాదాన్ని తెచ్చి పెట్టింది. సోమవారం న్యూజిలాండ్‌లోని గిస్బోర్న్ నగరంలో భూమి స్వల్పంగా కంపించింది. ఇక్కడ 7.45 పీఎంకు 4.4 తీవ్రతతో భూ కంపం సంభవించినట్టు వార్తా కథనాలు వచ్చాయి. కాగా, సోమవారం 10.18 పీఎంకు న్యూజిలాండ్‌లో 6.2 తీవ్రతతో భూమి కంపించినట్టు వాల్కనో డిస్కవరీ రిపోర్ట్ చేసింది.

న్యూజిలాండ్ దేశం ఇప్పటికే గ్యాబ్రియెల్ తుఫాన్‌తో సతమతం అవుతున్నది. ఈ తుఫాన్ కారణంగా సుమారు 46 వేల ఇళ్లలో కరెంట్ లేకుండా పోయింది. భారీ వర్షాలు, అతివేగంగా వీచే గాలులను ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. వందలాది విమానాలను రద్దు చేశారు. పలు ప్రాంతాలు ఇప్పటికే ఎమర్జెన్సీని ప్రకటించేశాయి. గ్యాబ్రియెల్ తుఫాన్ ఉత్తర దీవిని సమీపిస్తుండటంతో ప్రజల్లో ఒక రకమైన వణుకు మొదలైంది. ఇదిలా ఉండగా భూ కంపాలు చోటుచేసుకుంటున్నాయి.

Also Read: ఎల్‌టీటీఈ నేత ప్రభాకరన్ బ్రతికే ఉన్నారు.. ప్రజల ముందుకు వస్తారు: నెడుమారన్ సంచలన వెల్లడి

కొన్ని వారాల క్రితమే ఇక్కడ బీభత్సమైన వర్షం కురిసింది. చాలా చోట్ల వరదలు వచ్చాయి. ఈ వరదలు నలుగురిని పొట్టన బెట్టుకున్నాయి. ఆ వరదల నుంచి ఇంకా కోలుకోకముందే గ్యాబ్రియెల్ తుఫాన్ పంజా విసురుతున్నది. ఇంత లోనే భూకంప వార్తలు కలకలం రేపుతున్నాయి.