ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్య కేసులో సౌదీ అరేబియా కోర్టు సోమవారం ఐదుగురికి మరణశిక్ష విధించింది. ఈ కేసులో నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న 11 మందిలో ఐదుగురికి మరణశిక్ష, ముగ్గురికి 24 ఏళ్ల జైలు శిక్షను విధించగా, మిగిలిన వారిని నిర్దోషులుగా ప్రకటించింది.

Also Read:ఖషోగ్గీ హత్య: పిల్లలు నోరెత్తకుండా.. సౌదీ భారీ నజరానాలు

ఆ ఐదుగురికి హత్యతో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ప్రాసిక్యూటర్ తెలిపారు. ఈ కేసును విచారించిన రియాద్ కోర్టు అంతర్జాతీయ సమాజ ప్రతినిధులతో పాటు ఖషోగ్గి బంధువులు హాజరయ్యారు. నిందితులుగా పేర్కొన్న 11 మందికి సంబంధించిన వివరాలను సౌదీ ప్రభుత్వం వెల్లడించలేదు.

ఖషోగ్గి సౌదీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వాషింగ్టన్‌ పోస్ట్‌లో వ్యాసాలు రాసేవారు. ఈ క్రమంలో 2018, అక్టోబర్ 2న టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ రాయబార కార్యాలయంలో ఖషోగ్గిని కొందరు దుండగులు ఆయనను అత్యంత దారుణంగా హత్య చేశారు.

Also Read:జర్నలిస్టు ఖషోగ్గీని చంపి ముక్కలు చేసి... ఓవెన్‌లో సజీవదహనం

అయితే ఆయన హత్య కేసులో సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌కు సంబంధం ఉందని పలు వాదనలు వినిపించాయి. దీనిపై స్పందించిన సౌదీ రాజకుటుంబం మొదట తమకు సంబంధం లేదని బుకాయించినప్పటికీ.. అంతర్జాతీయంగా విమర్శలు వస్తుండటంతో మాట మార్చింది. ఇస్తాంబుల్‌‌లోని సౌదీ దౌత్య కార్యాలయంలో జరిగిన ఘర్షణలో ఖషోగ్గి బలయ్యాడని తెలిపింది.