ప్రముఖ అంతర్జాతీయ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీని సౌదీ అరేబియా ప్రభుత్వం అత్యంత దారుణంగా చంపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మృతదేహాం ఆనవాళ్లు తెలియకుండా సౌదీ అత్యంత చాకచక్యంగా వ్యవహరించింది.

హత్య అనంతరం ఖషోగ్గీ శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి అనంతరం శరీర భాగాలను మైక్రో ఓవెన్‌లో వేసినట్లు అల్ జజీరా ఛానెల్ కథనాన్ని ప్రసారం చేసింది. సౌదీ అరేబియాకు చెందిన జమాల్ ఖషోగ్గీ.. అక్కడి రాచరిక విధానాలపైనా ముఖ్యంగా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌ వ్యవహారశైలిని విమర్శిస్తూ వాషింగ్టన్ పోస్టులో కథనాలు రాసేవారు.

దీంతో ఆయనపై సౌదీ రాజకుటుంబం కక్ష పెంచుకుంది. ఈ క్రమంలో గతేడాది అక్టోబర్ 2న టర్కీలోని సౌదీ దౌత్య కార్యాలయంలోకి వెళ్లిన ఖషోగ్గీ మళ్లీ బయటికి తిరిగి రాలేదు. ఆయనను 15 మంది సౌదీ ఏజెంట్లు దౌత్య కార్యాలయంలోనే బంధింది అత్యంత దారుణంగా హత్య చేశారు.

అనంతరం అతడి శవాన్ని ముక్కలు ముక్కలు చేసి. సౌదీ కాన్సులేట్ జనరల్ ఇంటికి తరలించినట్లుగా అల్ జజీరా తెలిపింది. అనంతరం అక్కడ ఉన్న భారీ కొలిమిలో వేసి ఆయన మృతదేహాలను మండించినట్లు పేర్కొంది.

దాదాపు వెయ్యి డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతా సామర్ధ్యం ఉన్న కొలిమిని రూపొందించాలని సౌదీ కాన్సుల్ తనను ఆదేశించినట్లు అతడు  చెప్పాడని అల్ జజీరా పేర్కొంది. అంతేకాకుండా సౌదీ కాన్సుల్ ఆఫీసు గోడలపై ఖషోగ్గీ రక్తపు మరకలు అలాగే ఉన్నాయని వెల్లడించింది.

ఇప్పటికే ఖషోగ్గీ దారుణ హత్యతో సౌదీపై ప్రపంచం మండిపడుతున్న తరుణంలో శవాన్ని మాయం చేసేందుకు వినియోగించిన విధానం మరోసారి చర్చనీయాంశమైంది.