వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి దారుణ హత్య వ్యవహారంలో రోజుకోక కథనం వెలుగులోకి వస్తోంది. మొన్న ఖషోగ్గి హంతకులకు అమెరికా శిక్షణ ఇచ్చినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ప్రచురించగా... తాజాగా ఆయన సంతానానికి సౌదీ ప్రభుత్వం భారీ ఎత్తున సాయాన్ని అందజేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది.

ఖషోగ్గికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలకు జెడ్డా సమీపంలో దాదాపు నాలుగు మిలియన్ డాలర్ల విలువైన ఇళ్లు ఇవ్వడంతో పాటు నెలకు పదివేల డాలర్ల చొప్పున వారికి చెల్లించేందుకు సౌదీ ప్రభుత్వం ప్రతిపాదించింది.

అయితే ఖషోగ్గి పెద్ద కుమారుడు మాత్రమే సౌదీలో నివసించాలని అనుకుంటున్నాడని... మిగిలిన వారు ఆస్తులు అమ్మేసుకుని అమెరికాలో స్థిరపడాలని భావిస్తున్నట్లు కథనాన్ని ప్రచురించింది.

సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ విధానాలను విమర్శిస్తూ వాషింగ్టన్ పోస్టులో ఖషోగ్గీ కథనాలు రాసేవారు. దీనిపై ఆగ్రహాం వ్యక్తం చేసిన సౌదీ యువరాజు ఆయనను హత్య చేయించినట్లుగా అమెరికన్ నిఘా వర్గాలు తెలిపాయి.

ఈ క్రమంలో ఖషోగ్గీ సంతానం నోరెత్తకుండా ఉండటానికే సౌదీ యువరాజు భారీ ఎత్తున ధన సహాయం అందిస్తున్నారని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది.