Asianet News TeluguAsianet News Telugu

Operation Kaveri: సూడాన్‌లో భారతీయుల తరలింపు ప్రక్రియ ప్రారంభం, సౌదీకి బయల్దేరిన 278 మంది

సైన్యం, పారామిలటరీ బలగాల మధ్య ఘర్షణల నేపథ్యంలో ఆఫ్రికా దేశం సూడాన్‌లో కల్లోల పరిస్ధితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయుల తరలింపు కోసం కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కావేరిని ప్రారంభించింది. 
 

278 Indians leave from war-hit Sudan in naval ship under 'Operation Kaveri' ksp
Author
First Published Apr 25, 2023, 4:54 PM IST

సైన్యం, పారామిలటరీ బలగాల మధ్య ఘర్షణల నేపథ్యంలో ఆఫ్రికా దేశం సూడాన్‌లో కల్లోల పరిస్ధితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే స్థానికులతో పాటు పలువురు విదేశీయులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 400 మందికిపైగా మృతిచెందారు. దీంతో ఆయా దేశాలు అప్రమత్తమై.. తమ పౌరులను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

దీనీలో భాగంగా భారత్ కూడా ‘‘ఆపరేషన్ కావేరీ’’ పేరుతో భారతీయుల తరలింపుకు ప్రత్యేక మిషన్ ప్రారంభించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆపరేషన్ కావేరీ కింద చిక్కుకుపోయిన భారతీయుల మొదటి బ్యాచ్‌ను సూడాన్ నుండి తరలించారు. సౌదీ అరేబియాలోని జెడ్డాకు ఐఎన్‌ఎస్ సుమేధాలో మొత్తం 278 మంది పోర్ట్ సుడాన్ నుండి బయలుదేరినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపారు.

భారతీయుల తరలింపు కోసం భారత వాయుసేనకు చెందిన రెండు విమానాలు సౌదీ అరేబియాలోని జెడ్డాలో నిలిపివుంచారు. అలాగే సూడాన్ తీరంలో ఐఎన్ఎస్ సుమేధను అందుబాటులో వుంచింది భారత్. ఆపరేషన్ కోసం సూడాన్ అధికారులతో పాటు సౌదీ అరేబియా, యూఏఈ, ఈజిప్ట్ , అమెరికా తదితర దేశాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్లు జైశంకర్ తెలిపారు. ఆదివారం రాత్రి నాటికి 500 మంది భారతీయులు సూడాన్ నౌకాశ్రయం చేరినట్లు ఆయన వెల్లడించారు. సూడాన్‌లో 3000 మందికిపైగా భారతయులు వున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 

మన నౌకలు, విమానాలు భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకురావడానికి సిద్ధంగా వున్నాయని జైశంకర్ పేర్కొన్నారు. అక్కడ చిక్కుకుపోయిన వారందరికి సహాయం చేస్తామని ఆయన ట్వీట్ చేశారు. ఆపరేషన్ కావేరిని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి మురళీధరన్ పర్యవేక్షిస్తున్నారని ప్రధాని మోడీ చెప్పారు. సూడాన్‌లో పరిస్ధితి సంక్లిష్టంగా మారుతోందని.. అక్కడ చిక్కుకున్న 3000 మంది భారతీయులను క్షేమంగా స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్రం ఆదివారం తెలిపిన సంగతి తెలిసిందే. 

కాగా.. సూడాన్‌లో సూపర్ హెర్క్యులస్ మిలటరీ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను మోహరించాలని ఏప్రిల్ 21న ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. దీనికి అనుగుణంగా పౌరుల తరలింపుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ప్రధాని ఆదేశించారు. గతంలో ఆఫ్గనిస్థాన్ తాలిబాన్ల వశమైన సమయంలోనూ భారతీయుల తరలింపు కోసం భారత్.. అత్యాధునిక సీ 130జే రవాణా విమానాలను వినియోగించిన సంగతి తెలిసిందే. అయితే సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తదితర దేశాలు సూడాన్‌లోని వారి పౌరుల కోసం ప్రారంభించిన ఆపరేషన్ల సందర్భంగా ఇప్పటికే పలువురు భారతీయులు అక్కడి నుంచి బయటపడ్డారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios