బలూచ్ ఉగ్రవాదులు చేసిన రెండు వేర్వేరు దాడుల్లో 14 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. బలూచ్ ఉగ్రవాదులు పాకిస్తాన్‌కు పెద్ద తలనొప్పిగా తయారైన సంగతి తెలిసిందే.

పాకిస్తాన్‌కు చెందిన బలూచిస్తాన్ రాష్ట్రం మరోసారి తీవ్రవాద దాడులతో అట్టుడికింది. ఈసారి బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) సాయుధ విభాగం పాక్ సైన్యంపై రెండు ప్రాణాంతక దాడులు నిర్వహించింది. ఈ ఘటనలలో మొత్తం 14 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

మొదటి దాడి బలూచిస్తాన్‌లోని బోలాన్ జిల్లాలో జరిగింది. మాగ్ మరియు షోర్‌కంద్ ప్రాంతాల్లో పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ ప్రయాణిస్తున్న సమయంలో, బీఎల్ఏ స్పెషల్ టాక్టికల్ ఆపరేషన్స్ స్క్వాడ్ (STOS) ఏర్పాటు చేసిన రిమోట్ కంట్రోల్ ఐఈడీ (Improvised Explosive Device) పేలింది. ఈ శక్తివంతమైన పేలుడు కారణంగా సైనిక వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడిలో స్పెషల్ ఆపరేషన్స్ కమాండర్ తారిఖ్ ఇమ్రాన్, సుబేదార్ ఉమర్ ఫరూక్ సహా 12 మంది సైనికులు మరణించారు.

కొనసాగుతున్న గాలింపు చర్యలు

ఇంకొక దాడి అదే రోజు కెచ్ జిల్లాలో చోటుచేసుకుంది. కులాక్ టైక్రాన్ ప్రాంతంలో పాకిస్తాన్ బాంబ్ డిఫ్యూజల్ బృందం పర్యటిస్తున్న సమయంలో బీఎల్ఏ ఉగ్రవాదులు మరొకసారి దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు సైనికులు మరణించారు.ఈ రెండు దాడులు బలూచిస్తాన్ ప్రాంతంలో భద్రతా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపినట్లు అధికారులు తెలిపారు. బీఎల్ఏ తరఫున ఈ దాడులకు సంబంధించిన బాధ్యతను స్వీకరించగా, ప్రభుత్వం స్పందనను ఇంకా ప్రకటించలేదు.సైనిక అధికారుల ప్రకారం, దాడులు అత్యంత పణిస్థాయిలో జరగడంతో వాస్తవాల సేకరణ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.ఈ దాడులు బలూచిస్తాన్ ప్రాంతంలో కొనసాగుతున్న అసౌకర్యాలపై మళ్లీ దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. భద్రతా పరంగా ఈ ప్రాంతం మరింత సవాళ్లను ఎదుర్కొంటోంది.