Asianet News TeluguAsianet News Telugu

పుట్ బాల్ గ్రౌండ్ లో ఫ్యాన్స్ కుమ్ములాట, తొక్కిసలాట... ఇండోనేషియాలో 127 మంది మృతి

ఫుట్ బాల్ మ్యాచ్ సందర్భంగా అభిమానుల మధ్య చెలరేగిన గొడవలో ఏకంగా 127 మంది ప్రాణాలను బలయ్యాయి. ఈ ఘోర సంఘటన ఇండోనేేషియాలో చోటుచేసుకుంది. 

 127 people killed and 180 injured in riot at football match in Indonesia
Author
First Published Oct 2, 2022, 7:43 AM IST

జకార్తా : ఇండోనేషియాలో ఓ పుట్ బాల్ మ్యాచ్ వందకుపైగా ప్రాణాలను బలితీసుకుంది. రెండు జట్ల అభిమానులు గ్రౌండ్ లోనే గొడవకు దిగి విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి ఏకంగా 127 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలామంది తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.  

వివరాల్లోకి వెళితే... ఇండోనేషియాలోని తూర్పు జావా ప్రావిన్స్ లో శనివారం రాత్రి పుట్ బాల్ మ్యాచ్ జరిగింది. స్థానికంగా బాగా అభిమానులు కలిగిన పెర్సెబాయ సురబాయ వర్సెస్ అరెమా జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే చివరకు సురబాయ జట్టు చేతిలో అరెయా జట్టు ఓడిపోయింది. ఈ ఓటమిని భరించలేకపోయిన అభిమానులు అసహనం... గెలిచిన జట్టు అభిమానుల సంబరాల నేపథ్యంలో మైదానంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరు జట్ల అభిమానుల మధ్య చిన్నగా మాటలతో ప్రారంభమైన గొడవ చివరకు ఒకరిపై ఒకరు దాడిచేసుకునే స్ధాయికి చేరింది. ఇలా మైదానంలోని అభిమానులంతా రెండుగా చీలి ఒకరిపై ఒకరు దాడులకు దిగారు.  

ఈ ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో అభిమానులు మైదానం బయటకు వెళ్లేందుకు ఒక్కసారిగా పరుగుతీయడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఇలా పుట్ బాల్ అభిమానుల గొడవ, తొక్కిసలాటలో భారీగా ప్రాణనష్టం జరిగింది. ఏకంగా 127 మంది మృతిచెందగా మరో 200 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.  

Read More  చావు తప్పి కన్ను లొట్టబోయింది... వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్‌కి తీవ్ర గాయం...

అభిమానుల మధ్య జరుగుతున్న ఘర్షణను నియంత్రించేందుకు స్థానిక పోలీసులు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో లాఠీచార్జ్ చేసారు. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయితే ఆందోళనలను నియంత్రించే క్రమంలో ఇద్దరు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. 

అభిమానుల గొడవ, తొక్కిసలాట ఘటనలను ఇండోనేషియా ఫుట్ బాల్ అసోసియేషన్ సీరియస్ గా తీసుకుంది. వెంటనే ఈ ఘటనపై ఉన్నతాధికారుల నేతృత్వంలో విచారణకు ఆదేశించింది. అభిమానులను పోలీసులు, భద్రతా సిబ్బంది నియంత్రించలేకపోవడంతోనే ఇంత ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. 

ఈ ఫుట్ బాల్ మైదానం ఘటనలో గాయపడిన అభిమానుల్లో చాలామంది పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. మళ్లీ ఆందోళనలు చెలరేగకుండా పోలీసులు ముందస్తుగానే చర్యలు చేపట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios