Asianet News TeluguAsianet News Telugu

చావు తప్పి కన్ను లొట్టబోయింది... వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్‌కి తీవ్ర గాయం...

భారత మాజీ క్రికెటర్ ఉన్ముక్త్ చంద్‌ కంటికి గాయం... ట్విట్టర్‌లో ఫోటో షేర్ చేసిన 2012 అండర్ 19 వరల్డ్ కప్ కెప్టెన్... సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో అమ్ముడుపోని ఉన్ముక్త్ చంద్... 

2012 U19 World cup winning captain Unmukt Chand seriously injured shares pic in twitter
Author
First Published Oct 1, 2022, 6:18 PM IST

కెరీర్ ఆరంభంలో విపరీతమైన క్రేజ్ వస్తే దాన్ని కరెక్టుగా హ్యాండిల్ చేయడం చాలా కష్టం. దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ ఉన్ముక్త్ చంద్‌. 2012 అండర్ 19 వరల్డ్ కప్ విన్నింగ్ టీమిండియా కెప్టెన్ అయిన ఉన్ముక్త్ చంద్, క్రికెటర్‌గా కెరీర్ ఆరంభించడానికి ముందే విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, సురేష్ రైనాలతో కలిసి ఓ యాడ్‌లో నటించాడు. ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కాదు కదా... టీమిండియా నుంచి పిలుపు కూడా రాక ముందే తానేదో జీవితంలో గొప్ప గొప్ప విషయాలు సాధించినట్టు జీవిత చరిత్ర పుస్తకం కూడా తీసుకొచ్చేశాడు...

టీనేజ్ వయసు దాటక ముందే టన్నుల్లో క్రేజ్ తెచ్చుకుని తానేదో సాధించేశానని రిలాక్స్ అయిపోయిన ఉన్ముక్త్ చంద్, ఎంత త్వరగా పైకి ఎదిగాడో అంతే త్వరగా కనుమరుగైపోయాడు. ఐపీఎల్‌లో వరుసగా ఫెయిల్ అయ్యి, ఆ తర్వాత అవకాశాలు కూడా దక్కించుకోలేకపోయిన ఉన్ముక్త్ చంద్, 2021లో టీమిండియాకి రిటైర్మెంట్ ప్రకటించి అమెరికాకి మకాం మార్చాడు...

‘మైనర్ క్రికెట్ లీగ్’లో సత్తా చాటిన ఉన్ముక్త్ చంద్, బిగ్ బాష్ లీగ్‌లో పాల్గొన్న మొట్టమొదటి భారత పురుష క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. సౌతాఫ్రికా 20 లీగ్‌ వేలానికి కూడా పేరు రిజిస్టర్ చేయించుకున్నాడు ఉన్ముక్త్ చంద్. అయితే ఐపీఎల్‌లో ఉన్న ఫ్రాంఛైజీల యజమానులే, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో కూడా ఉండడంతో అక్కడ ఉన్ముక్త్ చంద్‌ని ఎవ్వరూ పట్టించుకోలేదు...

తాజాగా తనకు చావు తప్పి కన్ను లొట్టబోయిందంటూ గాయపడిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు 28 ఏళ్ల ఉన్ముక్త్ చంద్. ‘అథ్లెట్ అంటే జీవితం చాలా సాఫీగా సాగిపోతుందని అనుకుంటారు చాలామంది. అయితే అది ఏ మాత్రం నిజం కాదు. కొన్ని సార్లు మనం విజయంతో తిరిగి వస్తాం, మరికొన్ని రోజులు నిరాశగా, ఓటమి భారాన్ని, గాయాలను ఇంటికి మోసుకురావాల్సి ఉంటుంది. పెద్ద ప్రమాదం తప్పినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నా.. కష్టపడండి కానీ జాగ్రత్తగా ఉండండి... తృటిలో కన్ను పోయేది... నన్ను విష్ చేసినవారందరికీ థ్యాంక్యూ...’ అంటూ ట్వీట్ చేశాడు ఉన్ముక్త్ చంద్...

టీమిండియా తరుపున దేశవాళీ క్రికెట్‌లో 67 ఫస్ట్ క్లాస్ మ్యాచులు, 120 లిస్టు ఏ మ్యాచులు ఆడిన ఉన్ముక్త్ చంద్, ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తరుపున ఆడాడు. 2016 తర్వాత ఉన్ముక్త్ చంద్‌ని వేలంలో కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ఆసక్తి చూపించలేదు... దీంతో 2021 ఆగస్టులో టీమిండియాకి రిటైర్మెంట్ ప్రకటించిన ఉన్ముక్త్ చంద్, అమెరికాకి మకాం మార్చాడు...

వచ్చే ఏడాది 2023 వన్డే వరల్డ్ కప్‌లో యూఎస్‌ఏ జట్టు కెప్టెన్‌గా ఇండయాలో మెగా టోర్నీ ఆడాలని కలలు కంటున్నాడు ఉన్ముక్త్ చంద్. 

Follow Us:
Download App:
  • android
  • ios