హైదరాబాద్: ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా... పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా మహిళలకు రక్షణ లభించడంలేదు. ఇంటా బయట వారిపై వేధింపులు కొనసాగుతూనే వున్నాయి. అమ్మాయి కనిపిస్తే చాలు కొందరు మగాళ్లలో మృగాడు వెంటనే నిద్రలేస్తాడు. తాజాగా నడిరోడ్డుపై బస్సు కోసం ఎదురుచూస్తున్న ఓ యువతిని వేధించడమే కాదు అడ్డుకున్న పోలీసులపైనే దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఈ ఘటన తెలంగాణ  రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది.  

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ 28ఏళ్ల యువతి వ్యక్తిగత పనులపై హైదరాబాద్ కు వచ్చింది. ఈ క్రమంలోనే శనివారం రాత్రి తిరిగి తన స్వస్ధలానికి వెళ్లడానికి అమీర్ పేట బస్టాండ్ కు చేరుకుంది. అక్కడ బస్సుకోసం ఎదురుచూస్తున్న యువతిపై ఓ జులాయి కన్ను పడింది. 

read more  అక్రమసంబంధం అనుమానం... పోలీస్ క్వార్టర్స్ లో భార్యను చంపిన భర్త

యువతి ఒంటరిగా వుండటాన్ని గుర్తించిన యువకుడు దగ్గరకు వెళ్లి అసభ్యంగా మాట్లాడుతూ వేదింపులకు పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా తన వెంట రావాలంటూ ఒత్తిడి చేయసాగాడు. దీంతో యువతి పోలీసులుకు పోన్ చేయగా వారు వచ్చి యువకుడిని అడ్డుకునే ప్రయత్నం చేయగా వారితోనూ అతడు దురుసుగా ప్రవర్తించాడు. పోలీసులపైనే దాడికి ప్రయత్నించాడు. 

దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. మహిళలపై వేధింపులు, డ్యూటీలో వున్న పోలీసులపై దాడికి ప్రయత్నించినందుకు వివిధ సెక్షన్ల కేసులు నమోదుచేశారు.