విశాఖపట్నం: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను అతి దారుణంగా హతమార్చాడో కసాయి భర్త. పోలీస్ క్వార్టర్స్ లోనే భార్యను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... పాయకరావుపేట మండలం పెద్దిపాలేనికి చెందిన చందన భవానికి 2008లో  అంకంపేటకు చేందిన నాగళ్ల సింహాద్రితో వివాహమైంది. అయితే పెళ్లి తర్వాత కూడా చదువును కొనసాగించిన భవాని 2017లో కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పొందింది. ఇలా రెండేళ్లక్రితం ఆమెకు నక్కపల్లి పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్ లభించింది. 

అప్పటినుండి భవాని ఇదే పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తూ భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి క్వార్టర్స్ లో నివాసముండేది. అయితే విధుల్లో భాగంగా ఎక్కవగా బయట వుండే భార్యపై అనుమానాన్ని పెంచుకున్నాడు భర్త సింహాద్రి.  ఆమెకు ఇతరులతో అక్రమసంబంధాన్ని అంటగట్టి నిత్యం వేదించడం ప్రారంభించాడు. 

ఈ నేపథ్యంలోనే శుక్రవారం విధులు ముగించుకుని రాత్రి ఇంటికి వచ్చిన భార్యతో గొడవకు దిగిన అతడు అనుమానంతో ఆమె సెల్‌ఫోన్‌ను చెక్ చేయసాగాడు. దీంతో  భవాని అతడిని ఎదురించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. కోపంతో ఊగిపోయిన సింహాద్రి భార్యను చితకబాదడమే కాదు ఇంట్లో వున్న తాడును గొంతుకు బిగించాడు. దీంతో భవాని మృతిచెందింది. 

ఈ హత్యను ఆత్మహత్యగా నమ్మించి తప్పించుకోవాలని చూసిన సింహాద్రి భార్య మెడకు బిగించిన తాడుతోనే ఉరేశాడు. అనంతరం పోలీసులకు పోన్ చేసి తన భార్య ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు. అయితే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన పోలీసులు ఇది ఆత్మహత్య కాదు హత్య అని గుర్తించారు. దీంతో తమదైన స్టైల్లో భర్త సింహాద్రిని విచారించడంతో తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.