హైదరాబాద్ గాంధీ నగర్ పోలీస్టేషన్ పరిధిలో రైలు పట్టాలపై ఓ యువకుడి మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో స్థానికులు గుర్తించారు. వారు అందిచ్చిన సమాచారంతో సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు యువకుడిని హత్య చేసి రైలు పట్టాలపై పడేసినట్లు అనుమానిస్తున్నారు. చాలా రోజుల క్రితమే ఈ హత్య జరిగి వుంటుందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.  

ఈ క్రమంలో మృతుడి వివరాలను గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఇటీవల బన్సీలాల్ పేటకు చెందిన ఓ యువకుడు మిస్సయినట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. దీంతో పట్టాలపై  లభించిన మృతదేహం అతడిదేనా అన్న అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. 

read more   తోడబుట్టిన వారి కోసం త్యాగం..నగరంలో పని.. అనుకోకుండా..

బుదవారం రాత్రి మృతదేహాన్ని గుర్తించినా పట్టాల పక్కన వున్న ముళ్ళపొదల కారణంగా వెలికితీయడం సాధ్యపడలేదు. దీంతో ఇవాళ(గురువారం) ఉదయం మృతదేహాన్ని బయటకు తీసి పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోస్ట్ మార్టం రిపోర్టుతో ఈ మృతిపై క్లారిటీ రానుంది. 

ఇప్పటికే బన్సీలాల్ పేటలో మిస్సయిన యువకుడి కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీలక  సమాచారాన్ని రాబట్టారు.  కనిపించకుండా పోయిన రోజే ఆ యువకుడు నలుగురు యువకులతో కలిసి ఉన్నట్లు స్థానికులు గమనించారు. వారిచ్చిన సమాచారం మేరకు నిందితులను బుధవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో బన్సీలాల్‌పేట్‌లో చంపేసి రైల్వే పట్టాల పక్కన పడేసినట్లు చెప్పినట్లు సమాచారం. దీంతో పోలీసులు యువకుడి మృతదేహాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది.