తోడబుట్టిన వారి భవిష్యత్తు కోసం తన జీవితాన్ని పణంగా పెట్టింది. తన వెనక పుట్టిన తమ్ముడు, చెల్లెలు మంచిగా చదువుకోవాలని తన చదువును త్యాగం చేసింది. వారిని పోషించడానికి తాను పనిలో చేరింది. అయితే.. అనుకోకుండా.. ఆ యువతి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. కాగా... యజమాని వేధింపులు తట్టుకోలేక యువతి చనిపోయినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తుండగా... వేరే కారణాల వల్ల చనిపోయిందని యజమాని చెప్పడం గమనార్హం. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రగతినగర్‌లోని ఓ గేటెడ్‌ కమ్యూనిటీలోని ప్రసాద్‌ అనే ఫర్నిచర్‌ వ్యాపారి ఇంట్లో తూర్పుగోదావరి జిల్లా పోతులూరుకు చెందిన అపర్ణ (16) నాలుగేళ్లుగా పని చేస్తోంది. అపర్ణ పంపించే డబ్బుతోనే తమ్ముడు, చెల్లిని చదివిస్తోంది.

మూడు రోజల క్రితం వాచ్‌మన్‌ ఫోన్‌ ద్వారా అపర్ణ తన తల్లితో మాట్లాడింది. తానిక్కడ ఉండలేకపోతున్నానని వచ్చి తీసుకువెళ్లాలని కోరింది. లాక్‌డౌన్‌ కావటంతో తల్లి రావటం కుదర్లేదు. ఇదే క్రమంలో ఈ నెల 1న ఉదయం తొమ్మిది గంటల సమయంలో ప్రసాద్‌ ఇంట్లోనే అపస్మారక స్థితిలో పడి ఉన్న అపర్ణను తొలుత స్థానిక ఆస్పత్రికి, అక్కడి నుంచి కూకట్‌పల్లికి, అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. 

అప్పటికే పరిస్థితి విషమించి అపర్ణ మరణించింది. మంగళవారం నగరానికి చేరుకున్న ఆమె తల్లి.. కూతురు మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించింది. బుధవారం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం అపర్ణ మృతదేహాన్ని పోతులూరుకు తరలించారు.

అపర్ణ 2016 నుంచి ప్రసాద్‌ ఇంట్లో పని చేస్తున్నట్లు తల్లి ఫిర్యాదు చేశారు. అపర్ణ తన చివరి కాల్‌ను తల్లితో పాటు మరో వ్యక్తికి కూడా చేశారు. రెండో వ్యక్తి ఎవరూ అనేది విచారణలో తేలాల్సి ఉంది. ప్రసాద్‌ ఇంట్లో లభించిన మూత తీసిన పురుగుల మందు డబ్బా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె మరణించిన సమయంలో నోట్లోంచి నురగ వచ్చిందని, పురుగుల మందే తాగి ఉంటుందని భావిస్తున్నారు. యజమాని వేధింపుల వల్లే కూతురు మృతి చెందినట్లు  తల్లి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.