విద్య, తెలివి, వ్యాపారం ఎవరి సొత్తు కాదని, పట్టుదల ఉంటే అందరూ పారిశ్రామికవేత్తలు కాగలరన్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. గచ్చిబౌలిలోని ఐఎస్‌బీలో జరిగిన సిఎంఎస్టీ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీం కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.

పట్టుదల, చిత్తశుద్దితో పనిచేస్తే ప్రతి ఒక్కరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని చెప్పడానికి సిఎం కేసిఆర్ ను మించిన ఉదాహరణ లేదని కేటీఆర్ పేర్కొన్నారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి జెండాను పట్టుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన అసాధ్యమంటే...దానిని సుసాధ్యం చేసి నిలుపడానికి ఆయన పట్టుదల, నిరంతర కృషియే కారణమని కేటీఆర్ గుర్తుచేశారు.

ఈ రోజు ఇక్కడ పారిశ్రామిక వేత్తలుగా ఎంపికైన గిరిజన యువతను చూస్తుంటే వారికున్న ఆసక్తి, పట్టుదల కనిపిస్తోందన్నారు. పెద్ద, పెద్ద పరిశ్రమలు ఉన్నా, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వల్లే 70 శాతం ఉపాధి, ఉద్యోగాలు లభిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.

Also Read:హుజూర్‌నగర్ విజయం: బీజేపీది గాలివాటమే.. ఆ పార్టీ అసలు బలం ఇదేనన్న కేటీఆర్

చిన్న, మధ్య తరహా పరిశ్రమలను కాపాడేందుకు ఈ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ పార్కులలో గ్రామీణ యువతకు, మహిళలు, దళితులు, గిరిజనులకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.  

ఐఎస్ బిలో శిక్షణ పొంది, ప్రభుత్వ సాయంతో పరిశ్రమలు పెట్టే ప్రతి  ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాను వస్తానని, తనతో పాటు సెలబ్రిటీలను కూడా తీసుకొచ్చి అండగా ఉంటానని మంత్రి వెల్లడించారు.

సబ్సిడీల కోసం వ్యాపారాలు చేయకుండా, ఆసక్తి, పట్టుదల కోసం వ్యాపారాలు చేస్తే రాణిస్తారని, అలాంటి వారికి ఇండస్ట్రియల్ పార్కులలో అవకాశాలు ఎదురు చూస్తున్నాయన్నారు.

సమావేశంలో గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. గిరిజనులకు పరిశ్రమలు పెట్టడం ఒక కల అని, ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆశీర్వాదం వల్ల ఆ కల నేడు నిజమయిందన్నారు.

Also Read:''కేటీఆర్ సార్...చదువుకోవాలంటే ఈ సాహసం చేయాల్సిందేనా...''

ఆడపిల్ల  పుట్టినప్పటి నుంచి పెళ్లి అయ్యే వరకు, ఆ తర్వాత తల్లి అయిన తర్వాత తల్లి, బిడ్దల సంక్షేమం కోసం కూడా అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక సిఎం దేశంలో కేసిఆర్ ఒక్కరేనని అన్నారు. గిరిజనులు పారిశ్రామికవేత్తలు కావాలనే గొప్ప ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని రూపొందించి, నేడు నా గిరిజన బడ్డలు ఐఎస్ బిలో నిలబడి మాట్లాడే గొప్ప అవకాశాన్ని ఇచ్చారన్నారు