వరంగల్:  వరంగల్ జిల్లా జయముఖి ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థులు చదువుకోసం పెను సాహసం చేయాల్సి వస్తోంది. ఉప్పొంగుతున్న ఓ నీటి ప్రవాహాన్ని అత్యంత ప్రమాదకరంగా దాటాల్సి వస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఓ విద్యార్థి తాము కాలేజీకి వెళ్లడానికి ఎంతలా కష్టపడుతున్నామో చూడండి అంటూ ట్విట్టర్లో వీడియోను పోస్ట్ చేశాడు. నర్సంపేట నుండి నెక్కొండ కు వెళ్లే మార్గం ఇలా వుంది. ఎనిమిది నెలల క్రితం ఈ మార్గంలోని బ్రిడ్జి కుప్పకూలింది. ఇన్నాళ్లు గడుస్తున్నా ఎవ్వరూ తమ కష్టాలను పట్టించుకోలేదు. దయచేసి తమ సమస్యను పరిష్కరించండి.'' అంటూ మంత్రి కేటీఆర్ తో పాటు స్థానిక నాయకులు చల్లా భరత్ రెడ్డికి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. 

ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు మాదన్నపేట చెరువు ఉప్పొంగుతోంది. దీంతో ఉదృతంగా  ప్రవహిస్తున్న ప్రవాహాన్ని దాటుకుంటూ విద్యార్థులు ప్రమాదకర రీతిలో కాలేజికి వెళ్లాల్సి వస్తోంది.  ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా కావడంతో కేటీఆర్ స్పందించారు. 

ఈ సమస్య పరిష్కారం కోసం సంబంధిన అధికారులకు సూచించినట్లు తెలిపారు.  అలాగే రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ  సమస్య పరిష్కారమైతే వందలాది మంది విద్యార్థులతో పాటు స్థానికులకు ఉపశమనం కలగనుంది.