Asianet News TeluguAsianet News Telugu

పల్లె ప్రగతి ఇంకా పక్కాగా అమలవ్వాలి: అధికారులకు కేసీఆర్ ఆదేశం

గ్రామాలు పచ్చదనంతో, పరిశుభ్రతతో వెల్లివిరియాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం మరింత పకడ్బందీగా జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. 

telangana cm kcr review on palle pragathi programme in pragathi bhavan
Author
Hyderabad, First Published Jan 26, 2020, 9:11 PM IST

గ్రామాలు పచ్చదనంతో, పరిశుభ్రతతో వెల్లివిరియాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం మరింత పకడ్బందీగా జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. ప్రతీ రోజు ప్రతీ గ్రామంలో పారిశుధ్య పనులు జరగాలని, గ్రామాలు బాగుండడం కోసం ప్రతీ రోజు జరగాల్సిన పని జరిగి తీరాలని సిఎం అన్నారు.

పల్లె ప్రగతి కార్యక్రమం ఎలా అమలవుతున్నదీ, అధికారులు, ప్రజాప్రతినిధులు తమ పరిధిలో విధులు ఎలా నిర్వహిస్తున్నారు అనే విషయాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు త్వరలో తానే గ్రామాల్లో ఆకస్మిక పర్యటనలు జరుపుతానని సిఎం అన్నారు.

అధికారులు, ప్రజాప్రతినిథులు ఫోటోలకు ఫోజులిచ్చే కార్యక్రమం కాకుండా, చిత్తశుద్ధితో పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచే పనులు చేయించాలని కోరారు. పల్లె ప్రగతి స్పూర్తితో త్వరలో పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభించనున్నట్లు సిఎం వెల్లడించారు.

Also Read:హాజీపూర్ తుది తీర్పు: సైకో శ్రీనివాస్ రెడ్డికి ఉరేనా, తీర్పుపై ఉత్కంఠ..!!

పల్లెప్రగతి పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ‘‘ప్రజలు అయితే పల్లెల్లో, లేకుంటే పట్టణాల్లో నివసిస్తారు. ఈ రెండు చోట్లు బాగుంటే అంతా బాగున్నట్టే. అందుకే పల్లెలు, పట్టణాలు బాగుండాలని ప్రభుత్వం సంకల్పించింది. ముందుగా పల్లెప్రగతి కార్యక్రమం చేపట్టింది.

పంచాయతీ రాజ్ శాఖలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేశాం.ప్రతీ గ్రామానికి గ్రామ కార్యదర్శిని నియమించాం. పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచాము. ప్రతీ నెలా క్రమం తప్పకుండా రూ.339 కోట్ల చొప్పున విడుదల చేస్తున్నాం.

ప్రతీ గ్రామానికి ట్రాక్టర్ సమకూరుస్తున్నాం. ప్రభుత్వం ఇన్ని రకాల సహకారం, ప్రేరణ అందిస్తున్నప్పటికీ పల్లెలు బాగుపడకుంటే ఎట్ల? ఖచ్చితంగా బాగుపడి తీరాలి. ప్రతీ గ్రామానికి నర్సరీ ఏర్పాటు చేశాం. విధిగా అన్ని చోట్ల మొక్కలు పెంచాలి.

గ్రామాన్నిశుభ్రంగా ఉంచడానికి ప్రతీ రోజు వీధులు ఊడ్చాలి. మోరీలు శుభ్రం చేయాలి. కొన్ని రోజులు చేసి చేతులు దులుపుకోవడం కాదు. ప్రతీ రోజు గ్రామాల్లో ఏం జరగాలో అవన్నీ జరగాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.

‘‘పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా కొందరు మంత్రులు, కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు తామే గ్రామాన్ని ఊడ్చినట్లు పేపర్లో ప్రచారం కోసం ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. ఇది సరైంది కాదన్నారు.

వారంతా ఉన్నది చీపిరి పట్టి ఊడ్వడానికి కాదు... గ్రామాల్లో ఎవరి పని వారితో చేపించడానికి. గ్రామ పంచాయతీల్లో అవసరమైన సిబ్బందిని నియమించాం. వేతనాలు పెంచాం. ట్రాక్టర్లున్నాయి. వాటిని ఉపయోగించి, పని చేయించాలి. అంతే తప్ప మొక్కుబడి వ్యవహారం కావద్దని కేసీఆర్ తెలిపారు.

Also Read:కొల్లాపూర్‌లో జూపల్లికి షాక్: మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డిదే పై చేయి

గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పనులు ఎలా జరుగుతున్నాయి? పల్లె ప్రగతి పురోగతి ఏమిటి? ఎవరెవరు తమ బాధ్యతలు సరిగ్గా నిర్వహిస్తున్నారు? అనే విషయాలు పరిశీలించడానికి నేనే స్వయంగా త్వరలో గ్రామాల్లో ఆకస్మిక పర్యటనలు చేస్తాను’’ అని ముఖ్యమంత్రి అన్నారు. 

మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ తివారి, పంచాయతీ రాజ్ కమిషనర్ రఘునందన్ రావు, పిసిసిఎఫ్ శోభ, సిఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్, ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఓఎస్డి ప్రియాంక వర్గీస్ తదితరులు పాల్గొన్నారు. 

పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో జరిగిన పనులు

* 12,751 గ్రామాలకు గాను 12,705 గ్రామాల్లో నర్సరీల ఏర్పాటు
* ఇప్పటి వరకు 6,017 ట్రాక్టర్ల కొనుగోలు, మరో 4,534 ట్రాక్టర్లకు ఆర్డర్ 
* ఇప్పటి వరకు గ్రామాల్లో 10.78 కోట్ల మొక్కలు నాటగా, వాటిలో 84 శాతం మొక్కలు బతికాయి
* 76,562 కిలోమీటర్ల మేర వీధులను శుభ్రం చేయడం జరిగింది.
* 62,976 కిలోమీటర్ల మేర మురికి కాల్వలను శుభ్రం చేయడం జరిగింది.
* 48,767 చోట్ల పాత ఇండ్ల శిథిలాలను తొలగించడం జరిగింది.
* 1,24,655 చోట్ల పొదలు, తుప్పలు, మురికి తుమ్మలను తొలగించారు.
* 56,213 చోట్ల ఖాళీ ప్రదేశాలు, కామన్ ఏరియాలను శుభ్రం చేశారు
* 9,954 పాత, పనిచేయని బోర్లను మూసివేశారు
* 1,13,881 చోట్ల నీరు నిల్వ ఉండే బొందలను పూడ్చివేశారు.
* 56,050 చోట్ల రోడ్ల గుంతలను పూడ్చి వేశారు
* 67,245 చోట్ల ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాలను శుభ్రం చేశారు
* మార్కెట్లు, సంతలు నిర్వహించే 6,500 ప్రదేశాలను శుభ్రం చేశారు

Follow Us:
Download App:
  • android
  • ios