తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా తక్కువ వ్యవధిలోనే అనేక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించామని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ భేటీలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.

పల్లెలు, పట్టణాలు, పరిశుభ్రతతో ఉండాలని, కలెక్టర్ల వ్యవస్థను బలోపేతం చేసేందుకు గాను అదనపు కలెక్టర్లను నియమించినట్లు సీఎం తెలిపారు. గతంలో 112 కమిటీలకు కలెక్టర్లు ఛైర్మన్లుగా వ్యవహరించేవారని.. ప్రస్తుతం వాటిని 26 విభాగాలుగా విభజించడం వల్ల వారిపై పనిభారం తగ్గుతుందని కేసీఆర్ పేర్కొన్నారు.

Also Read:డ్రైవింగ్ లైసెన్స్ ట్వీట్ చేసిన కేటీఆర్: సోషల్ మీడియాలో వైరల్

పల్లెప్రగతి కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతూ ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇతర ఖర్చులను పక్కనబెట్టి గ్రామాలకు నిధులు మంజూరు చేస్తున్నామని.. పల్లెల అభివృద్ధికి కావాల్సిన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని కేసీఆర్ వెల్లడించారు.

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకునే అధికారం త్వరలోనే కలెక్టర్లకు ఇస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం తన అధికారాలను వదులుకుని కలెక్టర్లపై నమ్మకంతో వారికి బదిలీ చేసిందని,ఇంత చేసినా గ్రామాల్లో మార్పు రాకుంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

ఒక అడిషనల్ కలెక్టర్ కేవలం స్థానిక సంస్థలను సమర్థవంతంగా పని చేయించే బాధ్యతలు మాత్రమే నిర్వర్తించాలని సీఎం సూచించారు. రాబోయే పదిహేను రోజుల్లో జిల్లా స్థాయిలో ‘పంచాయతీ రాజ్ సమ్మేళనం’ నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు ముఖ్యమంత్రిగా నేను కూడా చేస్తానని ఆయన హెచ్చరించారు.

మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం మంత్రులు, కలెక్టర్ల బాధ్యత.  వారి పనితీరుకు ఇదే గీటురాయన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. దళితవాడలు, గిరిజన తండాలు, ఆదివాసీ గూడాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు పర్యటించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Also Read:కేసీఆర్ బర్త్ డే: కేటీఆర్ వినూత్న ఆలోచన ఇదీ..

అత్యవసర పనులకు గాను ప్రతి కలెక్టర్ వద్ద రూ. కోటి నిధులు అందుబాటులో ఉంచనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరానికి నెలకు రూ.78 కోట్లు, పట్టణాలు, నగరాలకు రూ.70 కోట్ల చొప్పున విడుదల చేయాలని కేసీఆర్ వెల్లడించారు.

భాగ్యనగరంలో కాలుష్య నివారణకు ప్రణాళిక రూపొందించాలని, డీజిల్ వాహనాలు తగ్గించి.. ఎలక్ట్రిక్ వాహనాలు పెంచే చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణ.. అక్షరాస్యత విషయంలో మాత్రం వెనుకబడి ఉందని దీనిని మార్చాలని సూచించారు.