శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌ చినజీయర్ స్వామి ఆశ్రమంలో జరిగిన తిరునక్షత్ర వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం దంపతులు చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.

అనంతరం భక్తులనుద్దేశించి చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. పెద్ద జీయర్ స్వామి వారి జీవిత చరిత్రను తెలుపుతూ రాసిన ‘‘సత్య సంకల్ప’’ గ్రంథాన్ని ఆవిష్కరించినట్లు తెలిపారు.

1940 ప్రాంతంలో తెలుగువారికి దేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో అస్సలు ఆదరణ ఉండేది కాదన్నారు. అప్పట్లో పెద్దజీయర్ స్వామి తమిళనాడు ప్రాంతానికి వెళ్లి మన సంస్కృతి, సాంప్రదాయాలను అక్కడ కూడా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారని చినజీయర్ తెలిపారు.

Also read:చినజీయర్ స్వామితో కేసీఆర్ భేటీ: మూడుగంటలపాటు మంతనాలు

1941లో ఓ వ్యక్తి రామాయణ గ్రంథాన్ని చింపివేశారని ఆ సమాచారం పెద్దజీయర్ స్వామికి తెలియలేదన్నారు. ఈ సంగతి తెలిసిన తర్వాత ఆయన 27 రోజుల పాటు రామాయణాన్ని పారాయణం చేస్తూ ఊరేగించాలని శిష్యులతో అన్నారని చినజీయర్ గుర్తుచేశారు.

అయితే అక్కడి తెలుగువారి నుంచి పెదజీయర్‌కు సరైన సాయం అందలేదన్నారు. అయితే మనప్రాంతం నుంచే తెలుగువారిని తీసుకుని రోడ్లపైనే స్నానం చేసి రామాయణ పారాయణ చేశారని చినజీయర్ తెలిపారు. ఆ తర్వాత అక్కడి వారి నుంచి మంచి స్పందనం వచ్చిందన్నారు.

అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ. తమ కుటుంబం శ్రీవైష్ణవ సాంప్రదాయంలోనే పూజలు నిర్వహిస్తూ వస్తోందన్నారు. తమ బాల్యంలో గురువులు ఇళ్లకి వచ్చి రామాయణ, భారత, భాగవతాలు బోధించి నెల రోజులు తమ ఇంటిలోనే ఉండేవారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.

చిన్న జీయర్ స్వామితో తనకు 1986 నుంచి పరిచయం వుందని.. ఆ సమయంలో సిద్ధిపేటలో నిర్వహించిన బ్రహ్మాయజ్ఞానికి అన్ని ఏర్పాట్లు దగ్గరుంచి చేశానని సీఎం వెల్లడించారు. యజ్ఞం జరిగినన్ని రోజులు చిన్నజీయర్ తమ ఇంట్లోనే ఉన్నారని..తాను ఆయనకి కారు డ్రైవర్‌గా మారిపోయానని కేసీఆర్ తెలిపారు.

యాగం మధ్యలో కానీ.. చివర్లో కానీ వర్షం పడుతుందని చినజీయర్ స్వామి చెప్పారని అలాగే జరిగిందని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. హైందవ మతానికి, సాంప్రదాయలకు ఎటువంటి ఢోకా ఉండదని కేసీఆర్ ఆకాంక్షించారు. పెద్దజీయర్ స్వామి వారి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుందామని సీఎం తెలిపారు. 

ప్రస్తుతం రాజకీయాల్లో పీఠాధిపతుల హవా పెరుగుతోంది. పలు రాష్ట్రాల ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒకప్పుడు ఆధ్యాత్మిక చింతనతో ఉండే స్వామీజీలు, పీఠాధిపతులు ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. 

Also Read:స్వాములు కేంద్ర బిందువులు: తెలంగాణలో చినజీయర్ స్వామి, ఎపిలో స్వరూపానంద

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ఆదర్శంగా తీసుకున్నారో ఏమో లేక రాజకీయ నాయకులు వారికి ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో తెలియదు గానీ ఇప్పుడు తెలుగురాష్ట్రాల రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారుతున్నారు స్వామీజీలు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ కు భక్తి ఎక్కువనే చెప్పాలి. ఆయన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సర్వతీని నమ్ముతారు. కేసీఆర్ ఏ కార్యం తలపెట్టినా శారదాపీఠాధిపతిని సంప్రదించకుండా చేయరనేది టాక్.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పుడు వాటిని అధిగమించేందుకు సీఎం కేసీఆర్ శారదాపీఠాధిపతిని సంప్రదించారు. ఆయన రాజశ్యామల యాగం చేయడంతో ఆ సమస్య పరిష్కరించబడిందని కేసీఆర్ నమ్మకం.

శారదాపీఠాధిపతియే కాదు త్రిదండి చినజీయర్ స్వామి అన్నా కేసీఆర్ కు చాలా భక్తి. కేసీఆర్ అప్పుడప్పుడు చినజీయర్ స్వామిని కలిసి ఆశీస్సులు తీసుకుంటారు. సాష్టాంగ నమస్కారం పెడుతూ వారి ఆశీస్సులు అందుకుంటారు. 

త్రిదండి చినజీయర్ స్వామి ఏది చెప్పినా తెలంగాణ సీఎం కేసీఆర్ వింటారని ప్రజల్లో టాక్ ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవలే తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేస్తామని కేసీఆర్ ప్రకటించినప్పుడు ఆయా ఉద్యోగ సంఘాల నేతలు నేరుగా కలిసింది చినజీయర్ స్వామినే. తమను మీరే కాపాడాలంటూ మెురపెట్టుకున్నారు. అంటే స్వామీజీలు రాజకీయాల్లో ఎంత ప్రముఖ పాత్ర వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారారు.