Asianet News Telugu

స్వాములు కేంద్ర బిందువులు: తెలంగాణలో చినజీయర్ స్వామి, ఎపిలో స్వరూపానంద

మెుత్తానికి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు త్రిదండి చినజీయర్ స్వామి ఎలాగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అలాగేనంటూ ప్రచారం జరుగుతుంది. ఈ నమ్మకం దైవభక్తికేనా లేక రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకుంటుందా అన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. 

Chinajeeyar Swami in Telangana: Swaroopananda in AP
Author
Amaravathi, First Published May 29, 2019, 11:15 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి: ప్రస్తుతం రాజకీయాల్లో పీఠాధిపతుల హవా పెరుగుతోంది. పలు రాష్ట్రాల ప్రభుత్వాల ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒకప్పుడు ఆధ్యాత్మిక చింతనతో ఉండే స్వామీజీలు, పీఠాధిపతులు ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. 

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ఆదర్శంగా తీసుకున్నారో ఏమో లేక రాజకీయ నాయకులు వారికి ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో తెలియదు గానీ ఇప్పుడు తెలుగురాష్ట్రాల రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారుతున్నారు స్వామీజీలు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ కు భక్తి ఎక్కువనే చెప్పాలి. ఆయన విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సర్వతీని నమ్ముతారు. కేసీఆర్ ఏ కార్యం తలపెట్టినా శారదాపీఠాధిపతిని సంప్రదించకుండా చేయరనేది టాక్.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పుడు వాటిని అధిగమించేందుకు సీఎం కేసీఆర్ శారదాపీఠాధిపతిని సంప్రదించారు. ఆయన రాజశ్యామల యాగం చేయడంతో ఆ సమస్య పరిష్కరించబడిందని కేసీఆర్ నమ్మకం.

శారదాపీఠాధిపతియే కాదు త్రిదండి చినజీయర్ స్వామి అన్నా కేసీఆర్ కు చాలా భక్తి. కేసీఆర్ అప్పుడప్పుడు చినజీయర్ స్వామిని కలిసి ఆశీస్సులు తీసుకుంటారు. సాష్టాంగ నమస్కారం పెడుతూ వారి ఆశీస్సులు అందుకుంటారు. 

త్రిదండి చినజీయర్ స్వామి ఏది చెప్పినా తెలంగాణ సీఎం కేసీఆర్ వింటారని ప్రజల్లో టాక్ ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవలే తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేస్తామని కేసీఆర్ ప్రకటించినప్పుడు ఆయా ఉద్యోగ సంఘాల నేతలు నేరుగా కలిసింది చినజీయర్ స్వామినే. తమను మీరే కాపాడాలంటూ మెురపెట్టుకున్నారు. అంటే స్వామీజీలు రాజకీయాల్లో ఎంత ప్రముఖ పాత్ర వహిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో విశాఖపట్నం శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు అత్యంత సన్నిహితంగా స్వరూపానందేంద్ర సరస్వతి ఉంటుండంతో వైసీపీ నాయకులు ఆయన వద్దకు క్యూ కడుతున్నారు. 

స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీర్వాదం కోసం బారులు తీరుతున్నారు. జగన్ ఎన్నికలకు ముందు ఏ పని చేసినా శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామీజీ ఆశీర్వాదంతోనే చేస్తారు. 

అంతేకాదు వైయస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం కూడా శారదాపీఠాధిపతి స్వరూపాందేంద్ర సరస్వతీ పెట్టారు. ఎన్నికల ఫలితాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడంతో వైయస్ జగన్ నేరుగా స్వరూపానందేంద్ర సరస్వతికి ఫోన్ చేసి ఆశీస్సులు తీసుకున్నారు. 

క్రైస్తవ మత సిద్ధాంతాలను ఆచరించే వైయస్ జగన్ స్వరూపానందేంద్ర సరస్వతి పట్ల గౌరవాన్ని చూపించడం, ఆయన ఆశీస్సుల కోసం నిత్యం వెళ్లడం చూసిన వైసీపీ నేతలు అధినేత బాటనే ఎంచుకున్నారు.  
 
ఉత్తరాంధ్ర మెుదలుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు విశాఖపట్నంలోని శారదాపీఠానికి క్యూ కడుతున్నారు. విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, అనకాపల్లి ఎంపీ సత్యవతి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, భీమిలి ఎమ్మెల్యే అవంతి  శ్రీనివాస్, దర్శి ఎమ్మెల్యే మద్ది వేణుగోపాల్ లు శారదా పీఠాన్ని దర్శించి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. 

వీరితోపాటు దర్శి ఎమ్మెల్యే మద్ది వేణుగోపాల్‌, జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను సామినేని, ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం తణుకు ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు శారదా పీఠాన్ని దర్శించుకుని స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు అందుకున్నారు. 
 
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా శారదా పీఠం దర్శనం కోసం క్యూ కడుతుండటంతో ఆశ్రమం వద్ద సందడి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో ఇప్పుడు విశాఖపట్నం శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారారని ప్రచారం జరుగుతుంది.  

అంతేకాదు పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ నవయుగ కంపెనీ చైర్మన్ విశ్వేశ్వరరావు సైతం స్వరూపానందేంద్ర సరస్వతిని కలిశారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టిపెడతారని అలా అయితే తన కాంట్రాక్ట్ పోతుందని విశ్వేశ్వరరావు ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఆయన స్వామీజీని కలవడం ఆశీస్సులు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. 

మెుత్తానికి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు త్రిదండి చినజీయర్ స్వామి ఎలాగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అలాగేనంటూ ప్రచారం జరుగుతుంది. ఈ నమ్మకం దైవభక్తికేనా లేక రాజకీయాల్లో కూడా జోక్యం చేసుకుంటుందా అన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios