హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12 లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసి బస్సు తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఓ యువతి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ప్రమాదంతో బంజారాహిల్స్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  

ఈ ప్రమాదంతో మృతిచెందిన యువతి ప్రముఖ సాప్ట్‌వేర్ కంపనీ టీసిఎస్ లో పనిచేస్తున్న సోహిని సక్సేనాగా తెలుస్తోంది. ఆమె మాసబ్ ట్యాంక్ నుండి బంజారాహిల్స్ వైపు స్కూటీపై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 

ఆర్టీసి బస్సును నడిపిస్తున్న తాత్కాలిక డ్రైవరే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. అతడు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ సోహిని ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టినట్లు చెబుతున్నారు. 

TSRTC Strike: డిపోల దగ్గర ఉద్రిక్తత.. ఆర్టీసీ కార్మికుల అరెస్టు

ఈ ఘటనపై ఆగ్రహానికి లోనైన  స్థానికులు తాత్కాలిక బస్సు డ్రైవర్ పై రాళ్ల దాడికి దిగారు. అంతేకాకుండా మృతదేహంతో రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసతో బంజారాహిల్స్ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. నిరసన చేపడుతున్న వారిని సముదాయించి ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి  ప్రయత్నిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.