హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కొద్దిసేపటి క్రితం విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. ముక్కపచ్చలారని ఓ చిన్నారి బాలుడు రోడ్డు ప్రమాదానికి గురై అతి దారుణమైన  పరిస్థితుల్లో మృత్యువాతపడ్డాడు. ఈ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసినవారికే కాదు బాలుడి మృతదేహాన్ని చూసినవారు కూడా కన్నీరు అపుకోలేకపోతున్నారు. 

ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. భవన నిర్మాణ కార్మికులుగా పని చేస్తున్న రాజ్ కుమార్  నగరంలో భవన నిర్మాణ కార్మికునిగా పనిచేస్తున్నాడు. అతడి అక్కా బావ కూడా ఉపాధి నిమిత్తం హైదరాబాద్ లో నివాసముంటున్నారు. వారికి 14 నెలల సతీష్ అనే కుమారుడు ఉన్నాడు.

అయితే రాజ్ కుమార్ ఇవాళ(సోమవారం) తన మేనల్లుడిని తీసుకుని బయటకు వచ్చాడు. ఈ క్రమంలో అతడు మాదాపూర్ జయభెరి సిలికాన్ టవర్స్ వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఓ స్కూటీ ఢీకొట్టింది. దీంతో అతడి చేతుల్లో వున్న మేనల్లుడి ఎగిరి పక్కకు పడిపోయాడు. దీంతో  తీవ్రంగా గాయపడ్డ ఆ చిన్నారి అక్కడికక్కడే మృతిచెందాడు. 

READ MORE  హైదరాబాద్ లో మహిళా టెక్కీ మిస్సింగ్.... 11 రోజులుగా కనిపించకుండాపోయి..

రాజ్ కుమార్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని స్థానికులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే చిన్నారి మృతి ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.  అనంతరం  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు ప్రమాదానికి కారణమైన వ్యక్తిని గుర్తించేపనిలో పడ్డారు.