హైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి ఘటనపై చేసిన ట్వీట్ కు హైదరాబాదు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ మీద ప్రజలు మండిపడ్డారు. ప్రియాంక రెడ్డి ఘటన హైదరాబాదులో జరగలేదనీ ఘటన రంగా రెడ్డి జిల్లాలో జరిగిందనీ అది సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వస్తుందనీ హైదరాబాదు పరిధిలోకి రాదనీ తెలియజేయాలని అంజనీకుమార్ ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టారు. 

శనివారం సాయంత్రం ఆయన ట్వీట్ ను పోస్టు చేశాడు. దానిపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం కావడంతో గంటల వ్యవధిలోనే దాన్ని తొలగించారు. ప్రియాంక రెడ్డి హత్య ఘటన హైదరాబాదులో జరిగిందని మీడియాలో రావడంపై ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దాంతో ఆ విషయంపై ఆయన స్పష్టత ఇవ్వదలుచుకున్నారు. ప్రియాంక రెడ్డి ఘటన హైదరాబాదు పరిధిలో జరగలేదని, సైబరాబాద్ పరిధిలో జరిగిందని స్పష్టత ఇచ్చారు. 

Also Read: మా ఇంటికి రావొద్దు: ప్రియాంక పేరెంట్స్, ఇంటికి తాళం వేసుకుని....

అత్యాచారం, హత్య కేసు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిందని, హైదరాబాదులో కాదని, ఓ చానెల్ తప్పుగా వార్తను ప్రసారం చేస్తోందని ఆయన ట్వీట్ లో అన్నారు దానిపై నెటిజన్లు ఆయనపై మండిపడ్డారు. 

సాంకేతిక అంశాన్ని ఎత్తి చూపడం వల్ల లాభం ఏమిటని వారు ప్రశ్నించారు. ఆ సాంకేతికపరమైన అంశం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా అని అడిగారు. ఇప్పుడు ఆ సమాచారాన్ని ట్వీట్ చేయడానికి కారణం ఏమిటని అడిగారు. 

Also Read: డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య: నిందితులు ముందే దొరికినా వదిలేశారు

ప్రపంచానికి ఇది హైదరాబాదు, మూడు కమిషనరేట్లు ఉన్నా కూడా.. ఇది దిగ్భ్రాంతికరమైన, విషాదకమైన సంఘటన అని వ్యాఖ్యానించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాదులో ఉందని ట్వీట్ చేసినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు, ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతమంతా హైదరాబాదు మాత్రమే అని మరొకరు ట్వీట్ చేశారు.