హైదరాబాద్: 2020-21 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను ఆ రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావు ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొదటిసారి ఆర్థిక మంత్రి హోదాలో ఆయన బడ్జెట్ ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ నాయకులు ప్రత్యేకంగా అభినందించారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హరీష్ పై ప్రశంసలు కురిపించారు. మొదటిసారి అయినప్పటికి  ప్రత్యేక శ్రద్దతో హరీష్ బడ్జెట్ రూపకల్పన అద్భుతంగా చేశాడని అన్నారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను దృష్టిలో వుంచుకుని ఈ బడ్జెట్ రూపకల్పన జరిగిందని... కాబట్టి ఎన్నికల హామీలన్నింటిని నేరవేరనున్నాయని అన్నారు. ముందుచూపుతో ఈ బడ్జెట్ లో కేటాయింపులు జరిపినట్లు అర్థమవుతుందని... ఇందుకు హరీష్ కు మరోసారి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. 

ఆర్థిక మాంద్యం కారణంగా కేంద్ర నుండి వచ్చే నిధులు తగ్గాయని... అలాగే రాష్ట్ర రాబడులు కూడా చాలా తగ్గాయని అన్నారు. అయినప్పటికి రాష్ట్రాభివృద్ది, సంక్షేమానికి ఎక్కడా నిధుల కొరత రాకుండా బడ్జెట్  రూపొందించారని అన్నారు. అన్ని రంగాలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్ కేటాయింపులు జరిగాయని సీఎం కేసీఆర్ అన్నారు. 

read more  తెలంగాణ బడ్జెట్ 2020: హైలైట్స్

 మంత్రి హరీష్ రావు మొదటిసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేటాయింపులు ఇలా సాగాయి. రా ష్ట్రంలోని ఇసుక, ఖనిజాలు ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని మరింత పెంచేందుకు గాను పకడ్బందీ వ్యూహాలు రచించినట్లు హరీష్ తెలిపారు. ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీలు తమ నియోజకవర్గాల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోసం ఒక్కొక్కరికి రూ. 3 కోట్లు చొప్పున నియోజకవర్గం అభివృద్ధి నిధులు అందించనున్నట్లు... నిధుల వినియోగానికి త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.

 ఈ బడ్జెట్‌లో పోలీస్ శాఖకు రూ.5,852 కోట్లు కేటాయించారు. అలాగే రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, నిర్వహణకు ఈ బడ్జెట్‌లో రూ. 750 కోట్లు కేటాయించారు.
 కలెక్టరేట్లు, డీపీవోలు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ నిర్మాణాల కోసం ఈ బడ్జెట్‌లో రూ.550 కోట్ల రూపాయల కేటాయించారు. మొత్తంగా రవాణా, రోడ్లు, భవనాల శాఖకు ఈ బడ్జెట్‌లో రూ.3,494 కోట్లు కేటాయించారు. 

 ఈ బడ్జెట్‌లో రాష్ట్రంలోని వివిధ దేవాలయాల అభివృద్ధి కోసం రూ.500 కోట్లు కేటాయించారు.  రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలు, వాటి నిర్వహణ కోసం రూ. 50 కోట్లు కేటాయించారు.  పూజారులకు అర్చక నిధి ద్వారా వేతనాలు అందించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

read more  తెలంగాణ బడ్జెట్‌ 2020: రైతు రుణాలు ఏక కాలంలో మాఫీ

 కొత్త పంచాయతీ రాజ్, మున్సిపల్ చట్టాల ప్రకారం వారి వారి బడ్జెట్లలో పది శాతం నిధులను హరిత ప్రణాళిక అమలుకు ఖర్చు చేస్తామన్నారు. ఈ బడ్జెట్‌లో పర్యావరణ, అటవీశాఖకు రూ.791 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,72,763 డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో లక్షమంది లబ్ధిదారులకు తమ స్వంత స్థలంలోనే ఇళ్లు నిర్మించుకోవడానికి ఆర్ధిక సాయాన్ని అందిస్తామని  తెలిపారు.  ఈ బడ్జెట్‌లో గృహ నిర్మాణాల కోసం రూ.11,917 కోట్లు కేటాయించారు. 

 ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి ఎంప్లాయిస్ బోర్డు ఏర్పాటు  చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ   బడ్జెట్‌లో ఆర్టీసీకి రూ.1000 కోట్లు కేటాయించారు.