హైదరాబాద్: హైదరాబాదులోని బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదంపై మృతురాలు సత్యవేణి భర్త సూర్యనారాయణ స్పందించారు. ఇటువంటి సంఘటన ఎవరికీ ఎదురు కాకూడదని ఆయన అన్నారు. తన భార్య ప్రమాదంలో మరణించినట్లు తన పెద్ద కూతురు తనకు చెప్పిందని ఆయన అన్నారు.

తనకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారని, ఇద్దరు కూడా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అని ఆయన చెప్పారు. తాను ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. తన భార్య హౌస్ వైఫ్ అని చెప్పారు.

Also Read: బయోడైవర్శిటీ ఫ్లై ఓవర్ రోడ్డు ప్రమాదం: అద్దె ఇంటికోసం వెళ్తూ ప్రాణాలు కోల్పోయిన మహిళ

హైదరాబాదులోని బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ నుంచి కారు పడడంతో సత్యవేణి అనే మహిళ మరణించిన విషయం తెలిసిందే. ఆమె కూతురు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. ప్రమాదం దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. 

కారు పడిన సమయంలో ఫ్లై ఓవర్ కింద మృతురాలితో పాటు ఆమె కూతురు నిలబడి ఉన్నారు. ఈ ఘటనలో ఓ మహిళ చనిపోయింది. కాగా, ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. గాయపడినవారిలో కారు డ్రైవర్ మిలన్ (27) కూడా ఉన్నాడు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

ప్రమాదంలో బాలరాజు (40), కుబ్రా (23), మృతురాలి కూతురు ప్రణీత (26) ఉన్నారు. గాయపడినవారిని హైటెక్ సిటీలోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సినిమా షూటింగ్ జరుగుతోందని తొలుత సంఘటనా స్థలంలో ఉన్నవారు అనుకున్నారు. కానీ, అది ప్రమాదమని తెలిసి ఒక్కసారిగా వెనక్కి తగ్గారు. 

Also Read: బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ప్రమాదం దృశ్యాలు

ప్రమాదానికి గురైన ఎర్రటి వోక్స్ వ్యాగన్ కారు ఫ్లై ఓవర్ పై గంటకు 104 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ కింద పడిపోయిందని పోలీసులు చెబుతున్నారు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.