హైదరాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ లిఫ్ట్ కింద పడి తొమ్మిదేళ్ల బాలుడు దుర్మరణం పాలయ్యాడు. రాయదుర్గం పంచవటి కాలనీలోని రోడ్ నెంబర్ 10లోని టీవీఎస్ లేక్ వ్యూ అపార్ట్‌మెంట్‌కు చెందిన ధనుష్ అనే బాలుడు ఆదివారం సాయంత్రం పైన ఉన్న ఫ్లాట్‌కి లిఫ్ట్ ద్వారా వెళ్లాలని భావించాడు.

అయితే ఆ సమయంలో లిఫ్ట్ దగ్గర ఎవరు లేకపోవడంతో ధనుష్ స్వయంగా లిఫ్ట్‌ను ఆపరేట్ చేసేందుకు ప్రయత్నించాడు. లిఫ్ట్ సేఫ్టీ గేట్‌ను తెరిచి చూస్తూ... ఒక్కసారిగా కిందపడ్డాడు. ఇంతలో పై నుంచి లిఫ్ట్ కిందకు దూసుకువచ్చింది. దీంతో ధనుష్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.

Also Read:లిఫ్ట్ రాకముందే లోపలికి వెళ్లి.. యువకుడు మృతి

చిన్నారి మరణంతో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ధనుష్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

కొద్దిరోజుల క్రితం విజయవాడలోనూ లిఫ్ట్ కారణంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. లిఫ్ట్ రాకముందే వచ్చిందనుకొని అందులోకి వెళ్లి... ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే... గవర్నర్ పేటకు చెందిన షేక్ ఇర్ఫాన్ అనే యువకుడు కుటుంబంతో కలిసి స్థానిక అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు. కాగా... మంగళవారం ఉదయం కిందకు వెళ్లేందుకు ఇర్ఫాన్ లిఫ్ట్ బటన్ నొక్కాడు. వెంటనే లిఫ్ట్ డోర్లు తెరుచుకున్నాయి. డోర్లు అయితే తెరుచుకున్నాయి కానీ.. లిఫ్ట్ పైకి రాకపోవడం గమనార్హం. అది గమనించుకోకుండా ఇర్ఫాన్.. లిఫ్ట్ లోకి వెళ్లాడు.

దీంతో... లిఫ్ట్ రూమ్ లోపల ఐదో అంతస్థు నుంచి కిందపడిపోయాడు. తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా ఇర్ఫాన్ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న గవర్నర్ పేట పోలీసులు సంఘటనాస్థలిని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. 

Also read: లిఫ్ట్ లో ఇరుక్కొని 9ఏళ్ల బాలిక మృతి

కాగా... ఇలా లిఫ్ట్ రాకముందే డోర్ తెరుచుకోవడంలో కొంత కాలం క్రితం హైదరాబాద్ లో కూడా ఓ మహిళ చనిపోయింది. ఇక లిఫ్ట్ లో ఇరుక్కొని చనిపోయేవారి సంఖ్య చాలానే ఉంది.  సాంకేతిక సమస్యల కారణంగానే  ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు చెబుతున్నారు.