World Health Day: మన  జీవన  శైలికి, మన ఆరోగ్యానికి దగ్గరి సంబంధం ఉంది. అందుకే మంచి అలవాట్లుంటే మనం ఆరోగ్యంగా నిండు నూరేళ్లు బతుకుతామంటున్నారు ఆరోగ్య నిపుణులు.  

World Health Day: కొంతమంది ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. చిన్న సమస్య వచ్చినా.. వెంటనే హాస్పటల్ కు వెళతారు. కానీ ఇంకొంతమంది పనిలో పడి.. బిజీ షెడ్యూల్స్ వల్ల ఆరోగ్యం గురించి పట్టించుకోవడమే మానేస్తుంటారు. ఇలాంటి వారికే ప్రమాదకరమైన, కోలుకోలేని అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. సమస్య చిన్నగా ఉన్నప్పుడే హాస్పటల్ కు వెళ్లడం మంచిది. అలాగే ఆరోగ్యం గురించి కూడా ఎంతో శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. మన ఆరోగ్యం ఎలా ఉండాలో మన జీవన శైలే డిసైడ్ చేస్తుందంటున్నారు నిపుణులు. అవును మన జీవన శైలి మెరుగ్గా ఉంటే మన ఆరోగ్యం బాగుంటుంది. లేదంటే ఎన్నో డేంజర్ రోగాలొచ్చే అవకాశం ఉంది. అయితే వారంలో 7 రోజులు కొన్ని పనులు చేస్తే మీ ఆరోగ్యం బేషుగ్గా ఉండటమే కాకుండా నిండు నూరేళ్లు ఎలాంటి నొప్పి, రోగం లేకుండా బతుకుతారంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఉదయాన్నే లేవడం

ఉదయాన్నే నిద్రలేవడం వల్ల మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. నిజానికి వాతావరణంలో ఆక్సిజన్ పరిమాణం ఉదయం పూట ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు ఉదయించే కొద్దీ అది క్రమంగా తగ్గుతుంది. అందుకే ఉదయాన్నే నిద్రలేస్తే మీ శరీరానికి స్వచ్ఛమైన ఆక్సిజన్ పుష్కలంగా అందుతుంది. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల మీరు పనులను చకచకా చేసుకుంటారు. తొందరగా అయిపోగొడతారు కూడా. 

ఏదో ఒక రకమైన వ్యాయామం లేదా యోగా 

మీ శరీరం రోజంతా సమర్థవంతంగా పనిచేయడానికి తగినంత శక్తి అవసరం. అందుకే ఉదయాన్నే లేచి వ్యాయామం లేదా యోగా చేయండి. ఎందుకంటే ఇవి మీ స్టామినాను పెంచుతాయి. అలాగే మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయి. దీని వల్ల మీరు మానసికంగా ఆరోగ్యంగా, దృఢంగా తయారవుతారు. బరువు అదుపులో ఉండానికి కూడా ఇవి సహాయపడతాయి. అంతేకాదు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా వ్యాయామం ఎంతగానో సహాయపడుతుంది.

ఆరోగ్యకరమైన అల్పాహారం 

చాలా మంది బ్రేక్ ఫాస్ట్ మానేసి నేరుగా లంచ్ నే చేస్తుంటారు. బ్రేక్ ఫాస్ట్ ను మానేయడం వల్ల లేనిపోని రోగాలు వస్తుంటాయి. అందుకే ఉదయం వ్యాయామం చేసిన తర్వాత ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ నే తినండి. ఇది మీరు రోజంతా పనిచేయడానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది.

జంక్ ఫుడ్ వద్దు 

బయటి ఫుడ్ టేస్టీగా అనిపించినా.. దీన్ని ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఇది మీ బరువును పెంచడంతో పాటుగా ఎన్నో రోగాల బారిన పడేస్తుంది. మీ జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండటానికి, వ్యాధులను అదుపులో ఉంచడానికి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడూ కూడా ఇంట్లో వండిన ఆహారాలనే తినండి. 

రాత్రి లేట్ గా తినొద్దు

రాత్రి 8 గంటల తర్వాత డిన్నర్ తినడం మానేయండి. దీనివల్ల అజీర్థి, నిద్రలేమి వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా తినగానే నిద్రపోకూడదు. నిద్రకు, మీరు తినడానికి మధ్య కొన్ని గంటల గ్యాప్ ఉండాలి. ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి తినడానికి, నిద్రపోవడానికి మధ్య కనీసం 2-3 గంటలు ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

తగినంత నిద్ర 

ఉదయాన్నే నిద్రలేస్తే ఆలస్యంగా పడుకోకండి. త్వరగా పడుకోవడం అలవాటు చేసుకోండి. ఇది మీ శరీరానికి పూర్తి విశ్రాంతినిస్తుంది. అలాగే ఎక్కువ కేలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన శరీరం, మెరుగైన మానసిక స్థితికి కనీసం 8 గంటల నిద్ర అవసరమని నిపుణులు అంటున్నారు.