వుహాన్ మార్కెట్లలో జంతువుల నుండి మానవులకు వైరస్ సంక్రమించిందా లేదా ల్యాబ్ ప్రమాదంలో లీక్ అయిందా అనే అంశాలను ఈ బృందం పరిశీలించనుంది. 

గత రెండు సంవత్సరాలుగా.. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేసింది. అసలు ఈ మహమ్మారి ఎక్కడి నుంచి పుట్టింది అనే విషయం మాత్రం ఎవరికీ తెలియడం లేదు. అయితే.. ఈ మహమ్మారి చైనా నుంచి వచ్చిందనే ఇతర దేశాలన్నీ ఆరోపిస్తున్నాయి. ఆ ఆరోపణలను మాత్రం చైనా ఖండిస్తూ వస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ కరోనా మహమ్మారిని కనుగొనడానికి ఇదే చివరి అవకాశం అని డబ్ల్యూహెచ్ఓ అభిప్రాయపడింది. సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ది ఆరిజిన్స్‌ ఆఫ్‌ నావెల్‌ పాథోజెన్స్‌(సాగో)కి 26 మంది నిపుణులను నామినేట్ చేసింది.

చైనా నగరమైన వుహాన్‌లో వైరస్ కనుగొన్నప్పటి నుంచి, ఒకటిన్నర సంవత్సరాలకు పైగా ఈ వైరస్‌ మొదట ఎలా ఉద్భవించిందనేది, సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది.వుహాన్ మార్కెట్లలో జంతువుల నుండి మానవులకు వైరస్ సంక్రమించిందా లేదా ల్యాబ్ ప్రమాదంలో లీక్ అయిందా అనే అంశాలను ఈ బృందం పరిశీలించనుంది. అయితే రెండో సిద్ధాంతాన్ని చైనా తీవ్రంగా ఖండించింది.

ఫిబ్రవరిలో, కోవిడ్ మూలాలపై పరిశోధించే పనిలో భాగంగా డబ్ల్యూహెచ్‌ఓ బృందం చైనాకు వెళ్లింది. వైరస్ బహుశా గబ్బిలాల నుండి వచ్చి ఉంటుందని, అయితే దీనిపై మరింత అధ్యయనం అవసరం అని ఓ అంచనాకు వచ్చింది.

కానీ, చైనా పారదర్శకంగా వ్యవహరించకపోవడం, డేటా ఇవ్వకపోవడం వల్ల విచారణకు ఆటంకం ఏర్పడిందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఆ తర్వాత చెప్పారు.

Also Read: గాయాలకు ఇంట్లో చికిత్స చేస్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు మీ కోసమే....

సాగో గ్రూపులోని ప్రతిపాదిత సభ్యులలో మునుపటి బృందంలో చైనా సందర్శించిన ఆరుగురు నిపుణులు ఉన్నారు.ఈ బృందం కరోనావైరస్ కాకుండా ఇతర హై-రిస్క్ వ్యాధికారకాల మూలాలను కూడా పరిశీలించనుంది.

"భవిష్యత్తులో వైరస్‌లు వ్యాప్తి చెందకుండా ఉండటానికి కొత్త వ్యాధికారకాలు ఎక్కడ నుండి వచ్చాయో అర్థం చేసుకోవడం చాలా అవసరం" అని డాక్టర్ టెడ్రోస్ చెప్పారు. సైన్స్ జర్నల్‌లో ఉమ్మడి సంపాదకీయంలో డాక్టర్ టెడ్రోస్, ఇతర డబ్ల్యూహెచ్‌ఓ ఉన్నతాధికారులు "ల్యాబ్ ప్రమాదాన్ని తోసిపుచ్చలేము" అని చెప్పారు."ఈ వైరస్ మూలాలను అర్థం చేసుకోవడానికి చివరి అవకాశం" కావొచ్చు అని డబ్ల్యూహెచ్‌ఓ ఎమర్జెన్సిస్‌ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ తెలిపారు.

కాగా.. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ లోనూ ఈ మహమ్మారి కారణంగా వేల మంది ప్రాణాలు కోల్పోయారు.