అబుదాబిలోని అల్ ఐన్ సిటీకి చెందిన 28 ఏళ్ల వ్యక్తిలో మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది. రిజల్ట్ పాజిటివ్‌గా రావడంతో యూఏఈ అధికారులు.. రోగితో సన్నిహితంగా మెలిగిన 108 మందిని గుర్తించారు.

నాలుగేళ్ల క్రితం చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఏ స్థాయిలో వణికించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైరస్ కారణంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోగా.. ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలమైంది. ఇప్పుడిప్పుడే ప్రపంచం కోవిడ్ నుంచి కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సోమవారం సంచలన ప్రకటన చేసింది. ఈ నెల ప్రారంభంలో అబుదాబిలోని అల్ ఐన్ సిటీకి చెందిన 28 ఏళ్ల వ్యక్తిలో మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్ యూఏఈ ప్రభుత్వ నోటిఫై చేసిన తర్వాత ‘‘MERS-CoV’’ను నిర్ధారించింది. ఈ రోగి జూన్ 3 నుంచి 7 మధ్య చాలా సార్లు నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిని సందర్శించారు. వాంతులు, కుడివైపు పార్శ్వనొప్పి, డైసూరియా (మూత్రం విసర్జించినప్పుడు నొప్పి)తో తాను బాధపడుతున్నట్లు ఆయన వైద్యులకు తెలిపారు. 

జూన్ 13 నాటికి, అతని పరిస్థితి విషమంగా మారడంతో ప్రత్యేక ప్రభుత్వ తృతీయ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)కి తరలించారు. అక్కడ అతనికి మెకానికల్ వెంటిలేషన్ అందించారు వైద్యులు. ఒంటెలు, మేకలు , గొర్రెలతో సన్నిహితంగా వున్న చరిత్ర లేనప్పటికీ జూన్ 23న పాలిమరేస్ చైన్ రియాక్షన్ (PCR) విశ్లేషణలో అతనికి నాసోఫారింజియల్ స్వాబ్ ‘‘MERS-CoV’’ పాజిటివ్‌గా తేలింది. రిజల్ట్ పాజిటివ్‌గా రావడంతో యూఏఈ అధికారులు.. రోగితో సన్నిహితంగా మెలిగిన 108 మందిని గుర్తించారు. అలాగే ‘‘MERS-CoV’’గా నిర్ధారణ అయిన రోజు నుంచి 14 రోజుల పాటు వారందరిని పర్యవేక్షణలో వుంచారు. అదృష్టవశాత్తూ .. మరో కేసు వెలుగులోకి రాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 

ఇతని కంటే ముందే యూఏఈలో నవంబర్ 2021లో చివరి సారిగా ‘‘MERS-CoV’’ను గుర్తించారు. యూఏఈలో తొలిసారిగా ఈ తరహా కేసును జూలై 2013లో గుర్తించారు. నాటి నుంచి ఈ వైరస్ బారినపడి యూఏఈలో 94 మంది అస్వస్థతకు గురవ్వగా.. 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు.. తాజాగా ‘‘MERS-CoV’’ కేసు వెలుగులోకి రావడంతో అబుదాబి పబ్లిక్ హెల్త్ సెంటర్ (ఏడీపీహెచ్‌సీ) అప్రమత్తమైంది. కేసులను గుర్తించేందుకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు పలు వర్క్‌షాపులను నిర్వహించింది. 

MERS అంటే ఏమిటి?

మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (MERS) అనేది మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనావైరస్ (MERS-CoV) అని పిలువబడే ఒక కరోనా వైరస్ వల్ల కలిగే వ్యాధి. ఇది ప్రధానంగా ఒంటెల నుంచి మనిషికి సంక్రమిస్తుందని నిపుణులు నిర్ధారించారు. తొలిసారిగా 2012లో సౌదీ అరేబియాలో దీన్ని గుర్తించారు. కరోనా వైరస్ అనేది సాధారణ జలుబు నుంచి తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్) వంటి వ్యాధులకు కారణమయ్యే వైరస్‌ల కుటుంబం. కోవిడ్ 19కి సమానంగా.. మధుమేహం, మూత్రపిండాల వైఫల్యం, ధీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి, బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ వంటి వైద్య పరిస్ధితులు ఈ సిండ్రోమ్ బారినపడిన వ్యక్తిలో కనిపనిస్తాయి. అప్పటికే అనారోగ్యంతో వున్న వారికి ఇది సోకితే మరణం సంభవించే అవకాశం ఎక్కువ. 

వైరస్ యొక్క మూలాలు ఏమిటి?

ఒక దశాబ్దం క్రితం కనుగొనబడినప్పటికీ, జూనోటిక్ వైరస్ మూలాల గురించి శాస్త్రవేత్తలకు ఖచ్చితంగా తెలియదు. అయినప్పటికీ, వైరస్ జన్యువుల పరిశోధనతో కూడిన వివిధ అధ్యయనాల ప్రకారం, MERS-Cov గబ్బిలాలలో ఉద్భవించి ఉండవచ్చు. గతంలో ఎప్పుడో ఒంటెలకు వ్యాపించి వుండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది మనిషి నుంచి మనిషికి సంక్రమించే అవకాశం కూడా వుంది. 

లక్షణాలు ఏమిటి?

సాధారణ MERS లక్షణాలలో జ్వరం, దగ్గు , ఊపిరి ఆడకపోవడం వంటివి ఉన్నాయని WHO పేర్కొంది. న్యుమోనియా సాధారణమే కానీ ఎల్లప్పుడూ ఉండదు. అతిసారంతో సహా జీర్ణశయాంతర లక్షణాలు కూడా రోగిలో కనిపిస్తాయి. అనారోగ్యం ఇలాగే కొనసాగితే, ఇది శ్వాసకోశ వైఫల్యానికి దారి తీస్తుందిని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి పరిస్ధితుల్లో మెకానికల్ వెంటిలేషన్ , ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తక్షణమే తరలించాల్సి రావొచ్చు. 

దీనికి చికిత్స ఎలా ?

ఈ వైరస్‌కు నిర్దిష్ట చికిత్స అందుబాటులో లేదు. క్రియాశీలంగా పరిశోధించబడిన , అనేక వ్యాక్సిన్‌లను కలిగి ఉన్న SARS వలె కాకుండా, mRNA-ఆధారితంగా MERS-CoVకి వ్యాక్సిన్ లేదు. రోగి వైద్య పరిస్థితిపై ఆధారపడి చికిత్సను అందిస్తారు. అవయవ వైఫల్యం ఉన్న రోగులలో ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెమ్బ్రేన్ ఆక్సిజనేషన్, డయాలసిస్‌తో సపోర్టివ్ ట్రీట్‌మెంట్ తరచుగా అవసరమవుతుంది. శక్తివంతమైన ఇన్ విట్రో యాక్టివిటీస్‌తో కూడిన యాంటీవైరల్‌లలో మోనోక్లోనల్ యాంటీబాడీస్, యాంటీవైరల్ పెప్టైడ్స్, ఇంటర్‌ఫెరాన్‌లు, మైకోఫెనోలిక్ యాసిడ్ లోపినావిర్‌లు సత్ఫలితాలను ఇస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. 

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

జంతువులు ఉన్న ప్రదేశాలను సందర్శించడం మానుకోవాలి. తప్పనిసరి పరిస్ధితుల్లో అటువంటి ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తే..జంతువులను తాకడానికి ముందు , ఆ తర్వాత పూర్తిగా చేతులు కడుక్కోవాలి. 

ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి?

ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, 2012 నుండి 27 దేశాలలో MERS-CoV కేసులు కనుగొనబడ్డాయి. ఈ సమయంలో, మొత్తం 2,605 కేసులు , 936 అనుబంధ మరణాలు నివేదించబడ్డాయి. MERS-CoVని కనుగొన్నప్పటి నుండి 35 శాతం మంది రోగులు మరణించి ఉండవచ్చని WHO అంచనా . ప్రస్తుతం యూఏఈలో ఈ వైరస్ ఉనికి చాటుకోవడంతో అప్రమత్తంగా వుండాలని అన్ని దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.