హార్డ్ వర్క్, ఎక్సర్ సైజెస్, డైట్ తో బాగా బరువు తగ్గాను. కానీ ఈ అలవాట్లను వదిలేసిన వెంటనే మళ్లీ బరువు పెరగడం మొదలుపెట్టానని చెప్పేవారు చాలా మందే ఉన్నారు. అసలు తగ్గి మళ్లీ బరువు పెరగడానికి అసలు కారణమేంటో తెలుసా?
ఈ రోజుల్లో ఏ ఒక్కరూ ఓవర్ వెయిట్ తో ఉండానుకోవడం లేదు. ఏదో ఒకవిధంగా వెయిట్ ను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు డైటింగ్, మరికొందరు వ్యాయామం, యోగా అంటూ వివిధ పద్దతులను పాటిస్తూ వెయిట్ లాస్ అవుతున్నారు. ఇదంతా బానే ఉన్నా.. బరువు తగ్గడం వరకు కష్టపడి ఆ తర్వాత దాన్ని మర్చిపోతున్నారు చాలా మంది. దీనివల్లే బరువు తగ్గిన మూడు నాలుగు నెలల తర్వాత మళ్లీ బరువు పెరిగిపోతున్నారు చాలా మంది. వ్యాయామం మానేయడం, ప్యాక్ చేసిన స్నాక్స్ ను తినడం వల్ల మళ్లీ బరువు పెరిగిపోయాను బాధపడేవారున్నారు. వెయిట్ లాస్ ప్రయాణం ముగిసిన తర్వాత కొన్నిచిట్కాలను పాటిస్తే మీ బరువు మీ కంట్రోల్ లో ఉంటుంది. అవేంటంటే..
హైడ్రేట్ గా ఉండండి
బరువు తగ్గే చిట్కాలను పాటించకపోయినా సరే పగటిపూట పుష్కలంగా నీటిని తాగండి. ముఖ్యంగా దాహాన్ని ఎప్పుడూ విస్మరించకూడదు. ఎందుకంటే నీళ్లు మీ జీవక్రియను నిర్వహించడంతో పాటుగా కేలరీలను బర్న్ చేస్తుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. నీరు ఇతర పానీయాలతో పోలిస్తే దాహాన్ని పూర్తిగా తీర్చుతుంది. బరువు నిర్వహణకు కూడా సహాయపడుతుంది.
ఒకేసారి తినకండి
ఒకేసారి ఎక్కువ ఆహారాన్ని తినడం మంచిది కాదు. ఇది మీ శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. అందుకే ఒకేసారి ఎక్కువగా తినకుండా రోజుకు 4 నుంచి 5 సార్లు కొద్ది కొద్దిగా తినడం అలవాటు చేసుకోండి. ఇది మీ జీవక్రియను ఎక్కువసేపు చురుకుగా ఉంచుతుంది. ఇది బరువును నిర్వహించడం సులభం చేస్తుంది. రీసెర్చ్ గేట్ ప్రకారం.. దాల్చినచెక్క, పసుపు, జాజికాయ వంటి జీవక్రియను పెంచే ఆహారాలను మీ రోజు వారి ఫుడ్ లో చేర్చాలి.
ఫుల్ గా తినకూడదు
అన్ని రకాల ఆహారాలను ఒకేసారి తినడం మానుకోండి. ముఖ్యంగా కడుపు నిండినప్పుడు. మీ కడుపు పూర్తిగా నిండినా.. ప్లేట్ లో ఇంకా ఉన్నాయని వాటిని కూడా లాగించడం మంచి అలవాటు కాదు. ఇలా చేయడం వల్ల మీ బరువు అమాంతం పెరుగుతుంది. అందుకే కడుపు నిండితే తినడం ఆపేయండి.
ఆరోగ్యకరమైన స్నాక్స్
మీ శరీరం బరువు పెరగకూడదంటే ముందుగా మీరు చేయాల్సిన మొదటి పని ప్రాసెస్ చేసిన, ప్యాక్ చేసిన, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ను స్నాక్స్ గా తీసుకోవడం మానేయాలి. బరువు తగ్గిన వెంటనే వీటిని తింటే మీ బరువు మళ్లీ పెరగడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ స్నాక్స్ లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. అందుకే పండ్లు, కూరగాయలు, పెరుగు, ఇతర ఫైబర్ ఎక్కువగా ఉండే ధాన్యాలను తినండి.
శారీరకంగా చురుకుగా ఉండండి
బరువు తగ్గాను ఇంకా వ్యాయామం అవసరం లేదు అనుకునే వారు చాలా మందే ఉన్నారు. కానీ బరువు తగ్గిన వెంటనే శాశ్వతంగా కూర్చోవడం వల్ల మీ బరువు మళ్లీ పెరుగుతుంది. అందుకే క్రమం తప్పకుండా కొన్ని శారీరక కార్యకలాపాల్లో బిజీగా ఉండండి. ఇలా చేయడం వల్ల మీ బరువు కంట్రోల్ లో ఉంటుంది. అలాగే ఇది మానసిక ఆరోగ్యానికి, మీ మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకవేళ మీకు టైం తక్కువగా ఉంటే వ్యాయామంతో పాటు, నడక, నృత్యం, ఇంటిని శుభ్రపరచడం వంటి ఇతర కార్యకలాపాలలో పాల్గొన్నా సరిపోతుంది.
