రాత్రిపూట కొన్ని పనులు చేస్తే అస్సలు నిద్రరాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రశాంతంగా పడుకోవాలంటే ఈ పనులు అస్సలు చేయకూడదు.
నిద్రలేకుంటే మన మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే ప్రతిరోజూ రాత్రి ఏడెనిమిది గంటలు నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. నిద్రతో మన శరీరం తిరిగి శక్తివంతంగా మారుతుంది. అలాగే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిద్ర శారీరక వైద్యం, పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. అలాగే కణజాలాలు, కండరాలను మరమ్మత్తు చేస్తుంది. మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అభిజ్ఞా పనితీరు, జ్ఞాపకశక్తి స్థిరీకరణ, భావోద్వేగ నియంత్రణకు నిద్ర చాలా అవసరం. నిద్ర ఏకాగ్రత, నిర్ణయం తీసుకోవడం, మానసిక స్థితి స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. తగినంత నిద్ర మీరు బరువు పెరగకుండా కాపాడుతుంది. అలాగే ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. గుండె జబ్బులు, డయాబెటిస్, మానసిక ఆరోగ్య రుగ్మతలు వంటి దీర్ఘకాలిక సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. నిద్ర రిఫ్రెష్ గా, శక్తివంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే నిద్రకు ముందు కొన్ని పనులు చేస్తే నిద్ర అస్సలు పట్టదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..
ఎలక్ట్రానిక్ పరికరాలు
స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు , ల్యాప్ టాప్ లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వెలువడే బ్లూ లైట్ నిద్రను ప్రేరేపించే హార్మోన్ మెలటోనిన్ ను తగ్గిస్తుంది. అందుకే పడుకోవడానికి ఒక గంట ముందే వీటిని ఉపయోగించకండి.
కెఫిన్, నికోటిన్
సాయంత్రం 6 గంటల తర్వాత కెఫిన్ లేదా నికోటిన్ ఉండే ఆహారాలను, పానీయాలను తీసుకోకండి. ఎందుకంటే ఇవి నిద్రకు భంగం కలిగిస్తాయి. సాయంత్రం వేళల్లో కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్, సిగరెట్లకు దూరంగా ఉంటేనే మీకు రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపడుతుంది.
భారీ భోజనం
పడుకోవడానికి ముందు హెవీ భోజనాన్ని చేస్తే అసౌకర్యం, జీర్ణ సమస్యలు వస్తాయి. ఇవి నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. అందుకే నైట్ టైం తేలికపాటి, పోషకాహారాన్ని తినండి.
ఆల్కహాల్
ఆల్కహాల్ వల్ల మొదట్లో గాఢంగా నిద్ర వచ్చినట్టుగా అనిపించినా.. ఆ తర్వాత ఇది మీకు మొత్తమే నిద్రలేకుండా చేస్తుంది. అలాగే నిద్రకు భంగం కలిగిస్తుంది. అందుకే పడుకోవడానికి ముందు కొద్దిమొత్తంలోనే మందును తాగండి.
ద్రవాలను ఎక్కువగా తీసుకోవడం
ఎక్కువ మొత్తంలో ద్రవాలను తాగడం.. ముఖ్యంగా నిద్రపోవడానికి ముందు నీటిని ఎక్కువగా తాగినా తరచుగా బాత్రూమ్ కు వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల నిద్రపోవడం కష్టమవుతుంది.
