మసాలా లేదా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తినవారికి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు  మాంసం ఎక్కువగా తినేవారికి కూడా  ఈ సమస్య రావొచ్చంటన్నారు. 

మన కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే మన జీవక్రియ మెరుగ్గా ఉంటుంది. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా.. బరువును కూడా అదుపులో ఉంచుతుంది. అసలు విషయానికొస్తే.. ప్రస్తుతం కాలెయ వ్యాధులు ఎక్కువవుతున్నాయి. కాలేయ వైఫల్యం లేదా ఫ్యాటీ లివర్ డిసీజ్ సమస్య వస్తే.. మీరు బరువు పెరగడంతో పాటు మరెన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అసలు ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే ఏంటి? దీన్ని నివారించాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మన శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలోని ప్రతి భాగాన్ని ఆరోగ్యంగా ఉంచాలి. ముఖ్యంగా మన అంతర్గత అవయవాలను. ఎందుకంటే ఇవి ఎన్నో పనులు చేస్తాయి. ఇలాంటి అవయవాల్లో కాలేయం ఒకటి. సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి మెరుగ్గా లేకపోవడం వల్ల చాలా మందికి ఫ్యాటీ లివర్ సమస్య వస్తోంది. 

నిపుణుల ప్రకారం.. చాలా మంది ఈ ఫ్యాటీ లివర్ ను సులువుగా గుర్తించలేకపోతున్నారు. వీళ్లు గుర్తించే సరికి ఈ సమస్య 75 శాతానికి పెరుగుతోందని నిపుణులు అంటున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ప్రతి ఏడాది కాలేయ ఆరోగ్యానికి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు సలహానిస్తున్నారు. సమస్య నిర్ధారణ అయిన వెంటనే.. మీ ఆహారం, జీవనశైలిలో అవసరమైన మార్పులు చేసుకోవాలి. 

ఫ్యాటీ లివర్ లక్షణాలు

కాలేయంలో సమస్యలు లేదా కాలెయ వ్యాధులు ఉన్నవారికి కాళ్ల వాపు, కామెర్లు, కడుపులో నీరు నిండటం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిది. ఇలాంటి లక్షణాలు మీలో కనిపిస్తే ఇప్పటికే మీ కాలెయం 75 శాతం దెబ్బతిన్నట్టే. ఎందుకంటే కాలేయం దెబ్బతిన్నప్పుడు మాత్రమే ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. డిప్రెషన్, వాంతులు, గందరగోళం, మూత్రపిండాలు దెబ్బతినడం వంటివి వ్యాధి ముదిరినంకనే కనిపిస్తాయి. 

ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు రోజూ వ్యాయామం చేయడంతో పాటుగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. దీంతో బరువును 15 శాతం వరకు తగ్గించుకోవచ్చు. మీరు తినే ఆహారంలో ఎక్కువ ఫైబర్, పిండి పదార్థాలు, పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు ఉండాలి. దీనితో శరీరానికి కావల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. ఇది బరువును తగ్గిస్తుంది. అలాగే బలహీనతను పోగొడుతుంది. కొవ్వు కాలేయం వ్యాధి ఉన్నవారు ఇంట్లో తయారుచేసిన ఆహారాన్నిమాత్రమే తినాలని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే ఇంట్లో తయారుచేసిన ఆహారం స్వచ్ఛమైనది. అలాగే దీనిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. 

ఏం తినకూడదు

కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవారు మాంసాన్ని ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే మాంసం తినడం వల్ల మీ ఆరోగ్యానికి ఇంకా ఎక్కువ హాని కలుగుతుంది. అయితే అన్ని రకాల మాంసాహారం ఈ కోవలోకి రాదు. రెడ్ మీట్, మటన్ తో సహా ఇతర నాన్ వెజ్ ఆహారాలు కొవ్వు కాలేయానికి హానికరం.

చేపలలో పాలీఅన్శాచురేటెడ్ కొవ్వు ఎక్కువగా ఉంటే, చికెన్ లో సంతృప్త కొవ్వు తక్కువ శాతం ఉంటుంది. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు ఈ రెండింటినీ తినొచ్చు. వీటిని తినడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే వీటిలో మసాలా దినుసులు, నూనె ఎక్కువగా ఉండకూడదు. అయితే మీరు ఫుడ్ ను తినడానికి ముందు దానిలోని  గ్లైసెమిక్ ఇండెక్స్, దాని బిఎమ్ఐ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీంతో మీరు దాన్ని ఎప్పుడు తినాలి? ఎంత తినాలో నిర్ణయించుకోవచ్చు. 

నిపుణుల ప్రకారం.. బరువును బట్టి శరీరానికి కిలో గ్రాము ప్రోటీన్ ఒక గ్రాము అవసరపడుతుంది. అర్థమయ్యేట్టు చెప్పాలంటే మీ బరువు 55 కిలోలు అయితే మీకు ప్రతిరోజూ 55 గ్రాముల ప్రోటీన్ మాత్రమే అవసరం. ఇప్పుడు మీరు వెజ్ ఫుడ్ లేదా నాన్ వెజ్ ఫుడ్ నుంచి శరీరానికి ప్రోటీన్ ను భర్తీ చేస్తున్నారా అనేది మీ ఇష్టం. అయితే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే శరీరంలో ఫ్యాటీ లివర్ సమస్య తగ్గుతుంది. పాదాల వాపు, కడుపులో నీటి వల్ల కలిగే ఇబ్బంది కూడా పోతుంది. సమస్య ఎక్కువగా ఉంటే హాస్పటల్ కు వెళ్లడం మంచిది.