కొన్ని రకాల ఆహారాలు శరీరానికి విశ్రాంతిని కలిగిస్తాయి. ఒత్తిడిని క్షణ కాలంలో మటుమాయం చేయడానికి సహాయపడతాయి. మీరు తీవ్రమైన ఒత్తిడిని ఫేస్ చేస్తున్నట్టైతే ఈ డైట్ ను తప్పకుండా పాటించండి. ఇవి మీ ఒత్తిడిని ఇట్టే పోగొట్టే మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాయి.
ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ బిజీ బిజీ సమయాన్ని గడుపుతున్నారు. కొందరైతే సరిగ్గా తినడానికి కూడా సమయం కేటాయించలేకపోతున్నారు. ఈ లైఫ్ స్టైల్ వల్ల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం అవుతుంది. ముఖ్యంగా ఒత్తిడి బాగా పెరిగిపోతుంది. ఒత్తిడి మానసిక సమస్యలనే కాదు శరీరక సమస్యలను కూడా కలిగిస్తుంది. అయితే వ్యాయామం, ధ్యానం, చికిత్సతో పాటుగా ఒత్తిడిని తగ్గించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయినప్పటికీ.. ఒత్తిడి స్థాయిలను తగ్గించడడానికి ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవును సరైన ఆహారాన్ని తింటే మన శరీరానికి పోషణ లభించడమే కాదు మన మనస్సుపై ప్రశాంతమైన ప్రభావం పడుతుందట. ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
సెరోటోనిన్ స్థాయిలను పెంచే ఆహారాలు
సెరోటోనిన్ ఒక న్యూరో ట్రాన్స్ మీటర్. ఇది మన మానసిక స్థితిని, ఆకలి, నిద్రను నియంత్రిస్తుంది. మెదడులో సెరోటోనిన్ గా మారిన అమైనో ఆమ్లం ట్రిప్టోఫాన్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తినడం వల్ల సెరోటోనిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది. టర్కీ, చికెన్, గుడ్లు, కాయలు, విత్తనాలు వంటి ఆహారాలు ట్రిప్టోఫాన్ కు గొప్ప వనరులు. సెరోటోనిన్ స్థాయిలను పెంచడానికి తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు కూడా బాగా సహాయపడతాయి.
యాంటీఆక్సిడెంట్లు
యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయి. అయితే ఈ ఆక్సికరణ ఒత్తిడి దీర్ఘకాలిక వ్యాధులు, మంటను కలిగిస్తుంది. ఒత్తిడి శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను పెంచుతుంది. ఇది కణాలు, కణజాలాలకు నష్టం కలిగిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తింటే ఫ్రీ రాడికల్స్ ను ప్రభావాన్ని తగ్గించొచ్చు. అలాగే ఒత్తిడి స్థాయిల ప్రభావాన్ని తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు బెర్రీలు, డార్క్ చాక్లెట్, ఆకుకూరలు, గింజలు వంటి ఆహారాల్లో పుష్కలంగా ఉంటాయి.
భోజనాన్ని స్కిప్ చేయకూడదు
భోజనాన్ని స్కిప్ చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు బాగా తగ్గుతాయి. ఇది మూడ్ స్వింగ్స్, చికాకును కలిగిస్తుంది. అందుకే క్రమం తప్పకుండా సమతుల్య భోజనం చేయండి. దీంతో మీ రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇది మీ మానసిక స్థితి మార్పులను నివారించడానికి సహాయపడుతుంది. అలాగే మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ను కూడా ఖచ్చితంగా చేయాలి. ఇది జీవక్రియను ప్రారంభిస్తుంది. అలాగే రోజంతా మిమ్మల్ని ఎనర్జిటిక్ గా ఉంచడానికి సహాయపడుతుంది.
కెఫిన్ ను తగ్గించండి
కెఫిన్ ఉన్నపాటుగా మన శరీరానికి శక్తిని ఇస్తుంది. కానీ మోతాదుకు మించి తాగితే మాత్రం ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు పెరుగుతాయి. అందుకే కెఫిన్ ను మోతాదుకు మించి అసలే తాగకూడదు. ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం. ఎందుకంటే ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.
హైడ్రేటెడ్ గా ఉండండి
నిర్జలీకరణం వల్ల అలసట, మూడ్ స్వింగ్స్, చికాకు వంటి సమస్యలు వస్తాయి. మీ బాడీని హైడ్రేట్ గా ఉంచడానికి, శరీర పనితీరు సరిగ్గా ఉండేందుకు రోజంతా పుష్కలంగా నీటిని తాగాలి. అలాగే చక్కెర పానీయాలు, ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించండి. ఎందుకంటే ఇవి నిర్జలీకరణానికి దారితీస్తాయి. అలాగే నిద్రకు ఆటంకం కలిగిస్తాయి.
