Popcorn Brain:మీరు ప్రతి నిమిషం ఫోన్ చెక్ చేసుకుంటున్నాారా? అయితే, పాప్‌కార్న్ బ్రెయిన్ బాధితులుగా మారినట్లే!
Popcorn Brain: మానసిక ఆరోగ్యం నేడు తీవ్రమైన ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఇలాంటి పరిస్థితిలో, మీరు మీ ఫోన్‌ని ఎప్పటికప్పుడు తరచూ చెక్ చేస్తూ ఉన్నారా? అయితే మీ కోసమే ఈ కథనం చదివేయండి.
నేటి డిజిటల్ ప్రపంచంలో, మన చుట్టూ నిరంతరం సమాచారం చుట్టుముడుతోంది. స్మార్ట్‌ఫోన్‌ల నుంచి ల్యాప్‌టాప్‌ల వరకు, ప్రతిచోటా సమాచారంతో దూసుకుపోతున్నాం. ఇది మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మీరు ఆలోచించి ఉండకపోవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ డిజిటల్ యుగంలో ‘పాప్‌కార్న్ బ్రెయిన్’ అనే కొత్త సమస్య వేగంగా అభివృద్ధి చెందుతోంది.
పాప్‌కార్న్ మెదడు అనేది మెదడు బలహీనమైన స్థితి. ఇది నిరంతరం ఒకదానిపై లేదా మరొకదానిపై దృష్టి కేంద్రీకరించే సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. అధిక సమాచారం తీసుకోవడం వల్ల ఇది జరుగుతుంది. ఇందులో, మనస్సు ఒక విషయం నుంచి మరొకదానిపైకి దూకుతూనే ఉంటుంది. ఒక అంశంపై ఆలోచన స్థిరంగా ఉండదు. ఏదైనా ఒకే పనిపై ఏకాగ్రత పెట్టడంలో ఇబ్బంది తలెత్తుతూ ఉంటుంది.
పాప్‌కార్న్ బ్రెయిన్ సమస్య ఉన్నవారిలో లక్షణాలు ఇవే...
ఏకాగ్రత కష్టం:
పాప్‌కార్న్ బ్రెయిన్ సమస్య ఉన్నవారు ఒక పని మీద దృష్టి పెట్టడం కష్టం అవుతుంది. పదే పదే పరధ్యానంలో ఉంటారు. ఏదైనా పని పూర్తి చేయడంలో ఇబ్బందిని ఎదుర్కొంటారు.
సులభంగా పరధ్యానంలోకి...
ఒక్కోసారి ఏదో ఒక సమాచారం మనసును చెదరగొడుతుంది. సోషల్ మీడియా నోటిఫికేషన్ లేదా మరొకరి మెసెజ్ వచ్చినప్పుడు చేస్తున్న పనిని వదిలివేసి.. దాన్ని చూడటానికి ఆసక్తి చూపిస్తారు.
పనిని నియంత్రించడంలో ఇబ్బంది...
ఏకాగ్రత తక్కువగా ఉండటం కారణంగా ఏ పనినీ పూర్తి చేయడంలో సంతృప్తి పొందలేరు. పని ఇంకా అసంపూర్తిగానే ఉందని పదేపదే తెలుస్తుంది.
ముఖ్యమైన పనులను మర్చిపోవడం...
తరచూ ఫోన్ చూడటానికి అలవాటు పడిపోయినందు వల్ల మెదడు చాలా సమాచారంలో చిక్కుకుపోతుంది. దీంతో ముఖ్యమైన పనులను కూడా గుర్తుంచుకోవడం కష్టం అవుతుంది.
ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది?
బలహీనమైన ఏకాగ్రత కారణంగా, పని నాణ్యత, పరిమాణం రెండూ ప్రభావితమవుతాయి. అదనపు సమాచారం మనస్సుపై భారంగా మారుతుంది. దీని కారణంగా ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది. ప్రతి పనిలో వైఫల్యం చెందుతున్నామనే భావన మనసును కుంగదీసి నిరాశకు గురి చేస్తుంది. బలహీనమైన మానసిక స్థితి కారణంగా, ఇతరులతో అనుబంధం బలహీనపడవచ్చు. సంబంధాలలో చీలిక కూడా వచ్చే ప్రమాదం ఉంది.
బీ కేర్ ఫుల్...
మీరు కూడా పాప్ కార్న్ బ్రెయిన్ లక్షణాలను అనుభవిస్తున్నట్లయితే... మీ డిజిటల్ అలవాట్లపై కాస్త శ్రద్ధ పెట్టండి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు, ప్రతి సమాచారాన్ని వెంటనే చూడాల్సిన అవసరం లేదు. మనస్సును రిలాక్స్ చేయడానికి, ఎప్పటికప్పుడు విశ్రాంతి తీసుకోండి. నిశ్శబ్ద ప్రదేశంలో కొంత సమయం గడపండి.