కొందరికి గొంతునొప్పి వారాల పాటూ ఉంటుంది. దీనివల్ల తాగడానికి, తినడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే గొంతునొప్పిని సులువుగా తగ్గించుకోవచ్చు. 

సీజన్ మార్పుతో గొంతు నొప్పి లేదా జలుబు రావడం సర్వసాధారణం. ఇది గొంతు నొప్పి, దురద లేదా చికాకుకు దారితీస్తుంది. ఈ సమస్య వల్ల ఫుడ్ ను మింగేటప్పుడు నొప్పి ఎక్కువవుతుంది. గొంతు నొప్పి పెద్ద సమస్య కాకపోవడంతో చాలా మంది దీని గురించి పట్టించుకోరు. అదే తగ్గాలని చూస్తారు. అయితే కొన్ని నేచురల్ పద్దతులతో గొంతునొప్పిని సులువుగా తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పరిశుభ్రత 

ఈ సమస్యలను తగ్గించుకోవడానికి మంచి పరిశుభ్రత పాటించడం ముఖ్యం. అందుకే మీ చేతులను శుభ్రంగా ఉంచుకోండి. తరచుగా కడుగుతూ ఉండండి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మీ నోటిని, ముక్కును కర్చీఫ్ తో కప్పండి. అలాగే వైరల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న వ్యక్తులతో సన్నిహితంగా ఉండకండి. ముఖ్యంగా మీ ఫుడ్ ను ఇతరులతో పంచుకోకండి. 

జీవనశైలి అలవాట్లను మార్చండి

గొంతు నొప్పిని తగ్గించుకోవడానికి మరొక ఎఫెక్టీవ్ మార్గం స్మోకింగ్ ను మానడం. విశ్రాంతి ఎక్కువగా తీసుకుంటూ నిర్జలీకరణాన్ని నివారించడానికి పుష్కలంగా ద్రవాలు తాగడం వంటి జీవనశైలి అలవాట్లు కూడా గొంతునొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. హైడ్రేటెడ్ గా ఉంటే గొంతు తేమగా ఉంటుంది. ఇది గొంతునొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది.

ఇంటి నివారణలను ప్రయత్నించండి

గొంతు నొప్పిని తగ్గించడానికి ఓవర్ ది కౌంటర్ మందులు ఉపయోగపడతాయి. అయినప్పటికీ కొన్ని ఇంటి చిట్కాలతో కూడా గొంతునొప్పికి చెక్ పెట్టొచ్చు. గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పువేసి గార్గ్లింగ్ చేయడం, తేనెను ఉపయోగించడం, విటమిన్ సి సప్లిమెంట్లను తీసుకోవడం, వెచ్చని ద్రవాలు తీసుకోవడం వంటి కొన్ని చిట్కాలతో గొంతు నొప్పి నుంచి ఉపశమనాన్ని పొందొచ్చు. 

హెర్బల్ టీలు తాగండి

గొంతు నొప్పి లక్షణాలను తగ్గించడానికి కొన్ని రకాల మూలికా టీలు కూడా సహాయపడతాయి. గొంతు నొప్పిని తగ్గించుకోవడానికి మూలికా టీలు బాగా సహాయపడతాయని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. మూలికా టీలు గొంతునొప్పికి కారణమయ్యే బ్యాక్టీరియా స్ట్రెప్టోకోకస్ ను ఎదుర్కోగలవని కనుగొన్నారు.

గొంతు నొప్పి ఎక్కువగా ఉంటే తప్పకుండా హాస్పటల్ కు వెళ్లాలి. గొంతునొప్పి వచ్చి 10 రోజులైనా అలాగే ఉంటే తప్పకుండా హాస్పటల్ కు వెళ్లండి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దద్దుర్లు, నీళ్లను తాగలేకపోవడం లేదా మింగలేకపోవడం, మీ నోరు తెరవడంలో ఇబ్బంది లేదా మీ గొంతులో ఏమైనా మార్పులు ఉంటే తప్పకుండా హాస్పటల్ కు వెళ్లాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.