మలబద్దకం చిన్న సమస్యగా కనిపించినా ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల ఒంట్లో శక్తి స్థాయిలు తగ్గతాయి. అంతేకాదు ఇది మీ దైనిదిన జీవితానికి కూడా ఆటంకం కలిగిస్తుంది. అందుకే దీన్ని వీలైనంత తొందరగా తగ్గించుకోవాలి.
దేశ జనాభాలో 60% మంది మలబద్దకం సమస్యను ఫేస్ చేస్తున్నారని పలు సర్వేలు వెళ్లడిస్తున్నారు. ఈ రోజుల్లో మలబద్దకం సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. పేగు కదలికలు తక్కువగా ఉండటం వల్లే మలబద్దకం సమస్య వస్తుంది. చెడు ఆహారపు అలవాట్లు, జీవన శైలి సరిగ్గా లేకపోవడం, పుష్కలంగా నీటిని తాగకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల మలబద్దకం సమస్య వస్తుంది. దీనివల్ల ఏమౌతుందిలే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది పైల్స్ నుంచి ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. అందుకే దీన్ని వీలైనంత తొందరగా తగ్గించుకోవాలి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు మలబద్దకాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. అవేంటంటే..
పెరుగు + అవిసె గింజల పొడి
పెరుగులో బిఫిడోబాక్టీరియం లాక్టిస్ అని పిలువబడే స్నేహపూర్వక బ్యాక్టీరియా లేదా ప్రోబయోటిక్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. అయితే అవిసె గింజలు కరిగే ఫైబర్ కు గొప్ప మూలం. కరిగే ఫైబర్ నీటిలో సులువుగా కరిగిపోతుంది. ఈ కాంబినేషన్ వల్ల మలం మృదువుగా, సులభంగా బయటకు వస్తుంది.
ఉసిరి జ్యూస్
ఉసిరి జ్యూస్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. 30 మిల్లీ లీటర్ల ఉసిరికాయ రసాన్ని ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో కలిపి తాగితే జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే మలబద్దకం సమస్య తగ్గుతుంది.
వోట్ బ్రాన్
ఓట్ బ్రాన్ లో కరిగే, కరగని ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్దకం నుంచి ఉపశమనం పొందడానికి, ప్రేగును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
నెయ్యి + పాలు
నెయ్యి బ్యూటిరిక్ ఆమ్లానికి గొప్ప మూలం. ఇది పేగు జీవక్రియను మెరుగుపరుస్తుంది. మలం కదలికకు సహాయపడుతుంది. నిద్రపోయే ముందు ఒక కప్పు వేడి పాలలో 1 టీస్పూన్ నెయ్యి కలిపి మరుసటి రోజు ఉదయం తాగండి. ఇది మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
నీళ్లు
నీళ్లను సర్వ రోగ నివారిణీ అంటారు. నీటిని పుష్కలంగా తాగితే ఎన్నో సమస్యలు దూరమవుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీటిని ఖచ్చితంగా తాగాలి. నీటిని పుష్కలంగా తాగకపోతే కూడా మలబద్దకం సమస్య వస్తుంది. మూత్ర సమస్యలు కూడా వస్తాయి. అందుకే నీటిని వీలైనన్ని ఎక్కువగా తాగండి. సమస్య తొందరగా నయమవుతుంది.
ఆహారం
మీరు తినే ఆహారంలో ఎక్కువగా పీచు పదార్థాలు ఉండేట్టు చూసుకోవాలి. ఇవి చాలా సులువుగా అరుగుతాయి. మల విసర్జనలో ఎలాంటి సమస్యలను కలిగించవు. మలబద్దకం సమస్య వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. వీటితో పాటు కొద్ది సేపు వ్యాయామం చేయండి. వీలైనంత ఎక్కువ సేపు నడవండి. శారీరక శ్రమ మిమ్మల్ని ఫిట్ గా ఉంచడమే కాదు ఎన్నో సమస్యలను కూడా తగ్గిస్తుంది.
