Asianet News TeluguAsianet News Telugu

మళ్లీ కోవిడ్ కలకలం : ఈసారి ఆయుధంగా నాజల్ వ్యాక్సిన్‌‌ , ఇంజెక్షన్‌తో పోలిస్తే ఎంత వరకు బెటర్..?

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు మరోసారి భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, నిపుణులు అప్రమత్తమవుతున్నారు. అయితే కోవిడ్‌పై పోరులో నాజల్ వ్యాక్సిన్ ఆయుధంగా మారనుందని విశ్లేషకులు అంటున్నారు. 

Nasal vaccine gets go-ahead amid global Covid threat
Author
First Published Dec 22, 2022, 6:34 PM IST

రెండేళ్ల పాటు ప్రపంచాన్ని నిద్ర లేకుండా చేసిన కోవిడ్ మహమ్మారి శాంతించిందని అంతా అనుకుంటున్న వేళ.. చైనాలో వైరస్ మరోసారి విజృంభిస్తోంది. డ్రాగన్ కంట్రీతో పాటు ఐరోపా దేశాల్లోనూ చాప కింద నీరులా వైరస్ వ్యాప్తి చెందుతోంది. తాజా కోవిడ్ విస్ఫోటనానికి ఒమిక్రాన్ బీఎఫ్ 7 వేరియంట్ కారణమని నిపుణులు చెబుతున్నారు. భారత్‌లోనూ ఇప్పటికే మూడు కేసులు వెలుగులోకి రావడంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. సరిగ్గా ఈ సమయంలో వ్యాక్సిన్‌లను ఆమోదించే నిపుణుల కమిటీ కీలక ప్రకటన చేసింది. నాజల్ వ్యాక్సిన్‌కు కమిటీ ఆమోద ముద్ర వేసింది. 

నాజల్ వ్యాక్సిన్‌లు ఇంజెక్షన్‌లకు దూరంగా వుండే వ్యక్తులకు పెద్ద ఉపశమనంగా నిపుణులు చెబుతున్నారు. ఇవి ఇంజెక్షన్ ద్వారా తీసుకునే టీకాల కంటే కూడా మెరుగైనవిగా చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కోవిడ్ పరిస్ధితులపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం సందర్భంగా నాజల్ వ్యాక్సిన్‌పై ప్రస్తావన వచ్చింది. వర్చువల్‌గా జరిగిన ఈ భేటీకి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, నీతి ఆయెగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తదితరులు హాజరయ్యారు. 

నాజల్ వ్యాక్సిన్‌లు మంచివేనా..?

నాజల్ వ్యాక్సిన్‌లు ఇంజెక్షన్‌ ద్వారా తీసుకునే వ్యాక్సిన్‌తో పోలిస్తే అదనపు ప్రయోజనాలను కలిగి వున్నాయి. నిల్వ సౌలభ్యం, పంపిణీ, తక్కువ వ్యర్ధాల ఉత్పత్తి ఇందులో ప్రధానమైనవి. నాజల్ వ్యాక్సిన్‌లు వైరస్.. మానవ శరీరంలోకి ప్రవేశించే ముక్కు , ఎగువ శ్వాస కోశం వద్ద రక్షణను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

ఇదిలావుండగా.. ప్రస్తుతం చైనాలో చోటు చేసుకున్న పరిస్ధితుల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక సూచనలు చేశారు. ఇప్పటికీ టీకాలు వేయించుకోని వారు వ్యాక్సిన్‌లు తీసుకోవాలని, అలాగే సీనియర్ సిటిజన్లు బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించారు. రద్దీగా వుండే ప్రదేశాల్లో ఖచ్చితంగా మాస్క్‌లు ధరించాలని తెలిపారు. 

డిసెంబర్ 1న సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) .. 18 ఏళ్లు మించిన వారికి అత్యవసర పరిస్థితుల్లో ఇంట్రా నాజల్ వ్యాక్సిన్‌ను ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. చైనా కూడా inhalable vaccineతో పాటు నాజల్ స్ప్రే వ్యాక్సిన్‌ను ఆమోదించింది. దీనితో పాటు రష్యా, ఇరాన్ కూడా mucosal vaccines‌లను అభివృద్ధి చేశాయి. 

ఇదిలావుండగా.. భారత్‌లో కొత్తగా 185 కరోనా కేసులు నమోదవ్వగా, యాక్టీవ్ కేసులు 3,402కు తగ్గినట్లు గురువారం నాడు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వీటితో కలిపి దేశంలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 4.46 కోట్లకు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ కారణంగా ఢిల్లీలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,681కి చేరుకుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios