Stress Relief: ఈ 5 జపనీస్ టెక్నిక్స్ తో మానసిక ఒత్తిడి పరార్. జీవితం చాలా కొత్తగా ఉంటుంది
Stress Relief: ప్రస్తుత కాలంలో మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. ఎందుకంటే అందరం ఉరకల పరుగుల జీవితాన్ని గడుపుతున్నాం. అందువల్ల ఒత్తిడి కామన్ అయిపోయింది. మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. అయితే జపనీస్ ఫాలో అయ్యే 5 చిట్కాలు త్వరగా రిలీఫ్ ఇస్తాయట. వాటి గురించి తెలుసుకుందాం రండి.

ప్రతి ఒక్కరికీ మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. పని ఒత్తిడి, సంబంధాలు, కుటుంబ సమస్యలు, విద్య ఇలా అనేక కారణాల వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. దీనివల్ల ఒత్తిడి ఏర్పడి మనసెప్పుడూ ఒక విధమైన ఆందోళనతో ఉంటుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి ఎన్నో మార్గాలున్నా జపనీస్ జీవన విధానంలో ఉన్న టెక్నిక్స్ మంచి రిజల్ట్స్ ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. జపనీస్ ఎక్కువగా ఉపయోగించే 5 మార్గాల గురించి చూద్దాం.
సింపుల్ లివింగ్ ఒత్తిడిని తగ్గిస్తుందని జపనీస్ సంస్కృతి చెబుతోంది. అందుకే వారు ఎప్పుడూ సులభమైన, సింపుల్ జీవన విధానాన్ని అనుసరిస్తారు. జపనీస్ అలవాట్లు మనసుకు ప్రశాంతతనిస్తాయి. ఒత్తిడిని తగ్గించడానికి, వ్యక్తిగత అభివృద్ధిని మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఈ పద్ధతులు సొసైటీలో మీ నడవడికను మెరుగుపరచడమే కాకుండా, మీరు మానసికంగా బలంగా తయారవడానికి ఉపయోగపడతాయి. ఆ టెక్నిక్స్ ఇవే.
1. లోపాలను అర్థం చేసుకోండి(వాబి-సబి టెక్నిక్)
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో టాలెంట్ నిరూపించుకోవాలని అనుకుంటున్నారు. కానీ, అనుకున్నది జరగకపోతే ఒత్తిడి, ఆందోళన పడుతుంటారు. దీంతో వారిలో ఒక విధమైన నిరాశ కలుగుతుంది. వాబి-సబి అనే ఈ పద్ధతి లోపాలను ఎలా అర్థం చేసుకొని పాజిటివ్ గా ముందుకు వెళ్లాలో చెబుతుంది. అన్నీ ఎప్పుడూ సరిగ్గా ఉండాలని లేదు. కొన్నిసార్లు లోపాలు, తప్పులు జరగడం సహజం. ఇదే విషయాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగాలని వాబి-సబి టెక్నిక్ చెబుతుంది.
2. సింపుల్ లివింగ్(కాన్సో టెక్నిక్)
కాన్సో టెక్నిక్ అంటే ఇంట్లో అవసరం లేని వస్తువులు తీసేసి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం. ఈ అలవాటు మనసుకు ప్రశాంతతనిస్తుంది. అవసరమైన వస్తువులు మాత్రమే ఇంట్లో ఉంటే ఇళ్లు ఖాళీగా, పెద్దగా కనిపిస్తుంది. ఇరుకుగా ఉన్న ఇంట్లో వస్తువులు ఎక్కువగా ఉంటే ఇల్లంతా చిరాకుగా ఉంటుంది. దీంతో అక్కడ నివసించే మనుషులకు కూడా చిరాకు, అసహనం పెరిగిపోతాయి. అందుకే తక్కువ వస్తువులతో జీవించడం మంచిది. అంతేకాకుండా మనసు ప్రశాంతంగా ఉండటానికి తటస్థ రంగులను, సహజమైన వస్తువులను ఉపయోగించమని కాన్సో టెక్నిక్ చెబుతుంది.
3. మీ కంట్రోల్ లో లేని వాటిని వదిలేయండి(షికాటా కా నాయి టెక్నిక్)
షికాటా కా నాయి టెక్నికట్ అంటే 'ఏమీ చేయలేము' అని అర్థం. మన నియంత్రణలో లేని విషయాలను అంగీకరించడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. అప్పుడు సమస్యను ఎలా పరిష్కరించాలో అర్థమవుతుంది. అలా కాకుండా ఇలాగే జరగాలి అని పట్టుపడితే సమస్య మరింత తీవ్రమవుతుంది.
4. సీజనల్ గా ఇంటిని శుభ్రం చేయండి(ఓసూజి టెక్నిక్)
ఓసూజి అంటే జపనీస్ భాషలో 'పెద్ద శుభ్రత' అని అర్థం. ఇది ప్రతి సీజన్ ముగిసిన తర్వాత చేయవలసిన ముఖ్యమైన విషయం. అంటే సమ్మర్, వింటర్, రైనీ సీజన్ ఇలా ప్రతి సీజన్ మారినప్పుడల్లా ఇల్లు, ఆఫీసు, దుకాణం లాంటివి శుభ్రం చేసుకోవాలి. దీని ద్వారా మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది. ఒక విధమైన ఎనర్జీ మీకు లభిస్తుంది.
5. నచ్చినట్టు బతకండి(ఇకిగాయ్ టెక్నిక్)
ఇకిగాయ్ టెక్నిక్ అంటే జీవితంలో మీ లక్ష్యాన్ని మీరు తెలుసుకోవడానికి సహాయపడేది. మీ జీవిత లక్ష్యాన్ని కనుగొని, మీకు నచ్చినట్లు జీవితాన్ని గడిపితే అది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మీ ఇకిగాయ్‌ను కనుగొనడానికి మీరు దేన్ని ఇష్టపడుతున్నారో, దేనిలో నైపుణ్యం కలిగి ఉన్నారో ఆలోచించి ఆనందకరమైన జీవితాన్ని గడపడం ప్రారంభించండి.

