ధ్యానం, యోగా ఆరోగ్యానికి ఎంత మంచివో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. వీటి కోసం రోజుకు కనీసం 15 నిమిషాలు కేటాయిస్తే చాలు మంచి ఫలితాలు చూడవచ్చు. ముఖ్యంగా మంచి నిద్ర, ఏకాగ్రత కోసం ధ్యానం, యోగా ఏ విధంగా ఉపయోగపడతాయో ఇక్కడ తెలుసుకుందాం.
మనలో చాలామంది నిద్రలేమి, ఏకాగ్రత లోపంతో బాధపడుతుంటారు. ఇది వారి మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడి, స్క్రీన్ టైం, బిజీ షెడ్యూల్స్ వల్ల శరీరం, మనసు రెండూ అలిసిపోతున్నాయి. అయితే అదృష్టవశాత్తు మనకు ధ్యానం, యోగా వంటి కొన్ని ప్రాచీన పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఇవి నిద్ర నాణ్యతను, మానసిక ప్రశాంతతను పెంచుతాయి.
నిద్ర, ఏకాగ్రతకు మధ్య సంబంధం?
నిద్రకి, ఏకాగ్రతకి సంబంధం ఉంది. ప్రతి మనిషికి గాలి, నీరు, ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. నిద్ర సరిగ్గా లేకపోతే.. చికాకు, నిరాశ, ఏకాగ్రత కోల్పోవడం వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడి, ఆందోళన, కొన్నిరకాల మందులు ఇందుకు కారణం కావచ్చు. అయితే ధ్యానం, యోగాలతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం.
1. మానసిక ప్రశాంతత, స్పష్టత కోసం ధ్యానం
ధ్యానం మనసుకు ప్రశాంతతనిస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ఏకాగ్రతను పెంచుతుంది. ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇది మనసును పరధ్యానం నుంచి దూరం చేస్తుంది. ప్రాణాయామం.. కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్) ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఒత్తిడి, ఆందోళన, నిరాశను దూరం చేసి ఏకాగ్రతను పెంచుతుంది. మెరుగైన నిద్రకు సహాయపడుతుంది. రోజుకు 10 నుంచి 15 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల శ్రద్ధ, జ్ఞాపకశక్తి, భావోద్వేగ నియంత్రణ మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
2. శారీరక, మానసిక సమతుల్యత కోసం యోగా..
యోగా అనేది సున్నితమైన కదలికలు, శ్వాస, ఏకాగ్రతతో కూడిన అభ్యాసం. ప్రతిరోజు యోగా చేయడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. యోగా శరీరాన్ని ఉత్సాహంగా ఉంచడంతోపాటు.. ఒత్తిడిని తగ్గిస్తుంది. మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. బాలాసనం, ఫార్వర్డ్ ఫోల్డ్స్, లెగ్స్-అప్-ది-వాల్ వంటి కొన్ని ఆసనాలు పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. ఫలితంగా ఆందోళన, రక్తపోటు తగ్గుతుంది. నిద్ర మంచిగా పడుతుంది.
వెన్ను నొప్పి, నడుము నొప్పి వంటి శారీరక సమస్యలు కూడా మన ఏకాగ్రతను దెబ్బతీస్తుంటాయి. అయితే కొన్ని యోగాసనాల ద్వారా వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు.
3. రాత్రి నిద్రపోయే ముందు..
రాత్రి నిద్రపోయే ముందు యోగా, ధ్యానం చేయడం వల్ల నిద్ర మంచిగా పడుతుంది. 10 నిమిషాల పాటు సున్నితమైన స్ట్రెచింగ్, 5 నుంచి 10 నిమిషాల పాటు ధ్యానం చేయడం వల్ల శరీరానికి, మనసుకు విశ్రాంతి దొరుకుతుంది. తద్వారా ప్రశాంతంగా నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది.
4. ఉదయం లేవగానే..
ఏకాగ్రత, మానసిక శక్తిని పెంచడానికి యోగా లేదా ధ్యానంతో రోజును ప్రారంభించండి. ఉదయం ధ్యానం చేయడం వల్ల మానసిక అస్పష్టత తొలిగిపోతుంది. సూర్య నమస్కారాలు లేదా తేలికపాటి స్ట్రెచింగ్.. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. శరీరాన్ని, మెదడును ఉత్తేజపరుస్తాయి. దానివల్ల రోజంతా ఉత్సాహంగా ఉండటంతో పాటు నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది.
