ప్రపంచవ్యాప్తంగా టీ ప్రియులు ఎక్కువయ్యారు. టీ తాగనిదే ఏ పని చేయని వారు లేకపోలేదు. టీ ఆరోగ్యానికి కొంతవరకు మేలు చేసినా.. ఇది ఎన్నో సమస్యలకు దారితీస్తుంది తెలుసా..
ఉదయాన్నే నిద్రలేవగానే చాలా మంది బ్రష్ కూడా చేయకుండా టీ తాగుతుంటారు. ఇంకొంతమంది బ్రేక్ ఫాస్ట్ కు ముందు టీ తాగడానికి ఇష్టపడతారు. కానీ ఈ రెండు అలవాట్లు అంటే ఖాళీ కడుపుతో టీ తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఖాళీ కడుపుతో టీ తాగడం ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
మన దేశంలో చాలా మంది టీ తాగడానికే ఎక్కువ ఇష్టపడతారు. ఇది దేశంలో అత్యధికంగా వినియోగించే పానీయం. ఉదయం ఖాళీ కడుపుతో, బ్రేక్ ఫాస్ట్ కు ముందు, లంచ్ తర్వాత, డిన్నర్ చేసిన తర్వాత కూడా టీ ని తాగడానికి ఇష్టపడతారు. టీలో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ.. దీన్ని తప్పుగా లేదా ఎక్కువగా తాగినా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.
టీ తాగడం వల్ల ఒత్తిడి, అలసట తొలగిపోతాయి. రీఫ్రెషింగ్ అనుభూతి కూడా కలుగుతుంది. కానీ దీన్ని ఎక్కువగా తాగడం వల్ల లేని పోని అనారోగ్య సమస్యలు వస్తాయి. బెడ్ టీ తీసుకోవడం వల్ల అనేక అనర్థాలు జరుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. పరిగడుపున టీ తాగడం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ వంటి ఇతర వ్యాధులు పుట్టి క్రమంగా అవి పెద్ద వ్యాధిగా రూపాంతరం చెందుతాయి. ఆ తర్వాత ఈ వ్యాధి అల్సర్ గా మారుతుంది. దీనిని ఎసిడిటీ ప్రమాదకరమైన దశ అని కూడా అంటారు.
టీ ఎప్పుడు హాని చేస్తుంది?
నిపుణుల ప్రకారం.. టీ లేదా కాఫీలో సహజ ఆమ్లం ఉంటుంది. అయితే ఆమ్లం మన శరీరంలో కూడా తయారవుతుంది. పరగడుపున టీ తాగితే శరీరంలో యాసిడ్ పరిమాణం పెరుగుతుంది. దీని వల్ల ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. పరగడుపున కాఫీ లేదా టీ తాగడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా షుగర్ లెవల్స్ ను పెంచుతుందని నిపుణులు అంటున్నారు. ఇది నోటి లోపల యాసిడ్ స్థాయిని పెంచుతుంది. ఇవి పొట్టకు చేరగానే ఎసిడిటీ పెరగడం మొదలవుతుంది. పరిగడుపున టీ తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయంటే..
నిర్జలీకరణాన్ని పెంచుతుంది
బ్రష్ చేసిన తర్వాత ఖాళీ కడుపుతో టీ తాగడం లేదా బెడ్ టీ తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్య పెరుగుతుంది. టీలో ఉండే అనేక హానికరమైన పదార్థాలు శరీరంలో మూత్రం స్థాయిని పెంచుతాయి. దీంతో పదేపదే వాష్ రూమ్ కు వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల శరీరంలో క్రమంగా నీరు తగ్గిపోతుంది. ఇది నిర్జలీకరణ సమస్యకు దారితీస్తుంది. దీన్ని నివారించాలంటే ఉదయాన్నే బెడ్ టీని తాగడం మానేయాలి.
జీర్ణక్రియ క్షీణిస్తుంది
ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల శరీర మెటబాలిజం మరింత క్షీణిస్తుంది. దీని వల్ల జీర్ణక్రియ క్షీణించే అవకాశం ఉంది. జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం వల్ల శరీరానికి తక్కువ శక్తి అందుతుంది. శరీరంలో తగినంత శక్తి లేకపోవడం వల్ల మీరు ఎప్పుడూ అలసిపోయినట్టుగా ఉంటారు. అంతేకాదు దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే జీర్ణక్రియను సమతుల్యంగా ఉంచడం, శరీరం వ్యాధికి నిలయంగా మారకుండా నిరోధించడం చాలా ముఖ్యం.
మలబద్దకం
ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఆందోళన కలుగుతుంది. దీంతో మలబద్ధకం సమస్య కూడా తలెత్తుతుంది. టీ శరీరాన్ని కాసేపు తాజాగా ఉంచుతుంది. కానీ దీన్ని ఎక్కువగా తాగితే నిద్ర సమస్యలు వస్తాయి. బరువు పెరగడం, ఆకలి లేకపోవడం, ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల రక్తపోటు సమస్యలు కూడా పెరుగుతాయి.
టీ తాగడానికి సరైన సమయం ఏది?
పరగడుపున టీ తాగడం వల్ల వచ్చే వ్యాధులను దూరం చేసుకోవాలంటే ఆహారం తిన్న ఒకటి లేదా రెండు గంటల తర్వాత టీ తాగడం మంచిది. మీరు టీ తాగాల్సి వచ్చినప్పుడల్లా దానితో అల్పాహారం లేదా బిస్కెట్ ను తినండి. దీనివల్ల డీహైడ్రేషన్, కడుపునొప్పి, ఎసిడిటీ తగ్గుతాయి.
