పీసీఓఎస్ ఉన్న ఆడవారు కొన్ని రకాల ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలి. చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు, ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలను తింటే సమస్య మరింత ఎక్కువ అవుతుంది.
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) అనేది హార్మోన్ల రుగ్మత. ఇది పునరుత్పత్తి వయస్సులో సుమారు 5-10% మంది మహిళలను ప్రభావితం చేస్తుంది. పీసీఓఎస్ ఉన్న మహిళలు తరచుగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఎక్కువ స్థాయిలో ఆండ్రోజెన్ హార్మోన్లు వంటి సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలతో పాటు పీసీఓఎస్ ఉన్న మహిళలు బరువు పెరగడం, ఇన్సులిన్ నిరోధకత, మంట వంటి సమస్యలు వస్తాయి.
పీసీఓఎస్ సమస్యను తగ్గించుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం బాగా ఉపయోగపడుతుంది. కొన్ని ఆహారాలు పీసీఓఎస్ లక్షణాలను పెంచుతాయి. మరికొన్ని వీటిని తగ్గించడానికి సహాయపడతాయి. పీసీఓఎస్ ఉన్న మహిళలు ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రాసెస్ చేసిన ఆహారాలు
ఫాస్ట్ ఫుడ్, స్తంభింపచేసిన ఆహారాలు, ప్యాకేజీ చేసిన స్నాక్స్ తో పాటుగా ప్రాసెస్ చేసిన ఆహారాలను తినకూడదు. ఎందుకంటే వీటిలో చక్కెర, ఉప్పు, అనారోగ్య కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. వాటిలో కృత్రిమ రుచులు, ఇతర హానికరమైన పదార్థాలు కూడా ఉంటాయి. ఇవి మంట, ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తాయి. పీసీఓఎస్ ఉన్న మహిళలు ఈ ఆహారాలను దూరంగా ఉండాలి.
చక్కెర పానీయాలు
సోడాలు, పండ్ల రసాలు, ఇతర చక్కెర పానీయాలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తాయి. పీసీఓఎస్ ఉన్న మహిళలు ఈ పానీయాలను అస్సలు తాగకూడదు. వీటికి బదులుగా నీళ్లు, మూలికా టీ లేదా కొబ్బరి నీరు వంటి తక్కువ చక్కెర ఉన్న పానీయాలను తాగాలి.
అధిక-గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు
వైట్ బ్రెడ్, పాస్తా, బియ్యం వంటి ఆహారాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇవి కూడా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. పీసీఓఎస్ ఉన్న మహిళలు వీటికి బదులుగా తృణధాన్యాలను తినాలి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి.
పాల ఉత్పత్తులు
పీసీఓఎస్ ఉన్న కొంతమంది మహిళలకు పాలు మంచివి కాకపోవచ్చు. ఎందుకంటే పాలు మంటను కలిగిస్తాయి. ఇన్సులిన్ నిరోధకతను ఎక్కువ చేస్తాయి.
సోయా ఉత్పత్తులు
సోయా ఉత్పత్తులలో ఫైటోఈస్ట్రోజెన్లు ఉంటాయి. ఇవి పీసీఓఎస్ ఉన్న మహిళల్లో హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి. అందుకే పీసీఓఎస్ ఉన్న మహిళలు టోఫు, సోయా పాలు, సోయా ఆధారిత ఆహారాలను అసలే తీసుకోకూడదు.
పీసీఓఎస్ సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుందా?
అవును పీసీఓఎస్ సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది. పీసీఓఎస్ ఉన్న మహిళలకు పీరియడ్స్ సక్రమంగా ఉండవు. హార్మోన్ల అసమతుల్యత కూడా ఉంటుంది. ఈ రెండింటి వల్ల వీరు గర్భందాల్చడం కష్టంగా ఉంటుంది.
పీసీఓఎస్ లక్షణాలు
పీసీఓఎస్ లక్షణాలు ఒకమహిళకు, ఇంకో మహిళకు వేరువేరుగా ఉంటాయి. కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, బరువు పెరగడం, మొటిమలు, జుట్టు ఎక్కువగా రాలడం వంటి సమస్యలు కామన్ గా అందరిలో కనిపిస్తాయి.
